రోజురోజుకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుందని తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నం వేరే దారి వెతుక్కునే పనిలో పడ్డారా..? అల్రెడీ బీఆర్ఎస్ తో బేరసారాలు జరుపుకున్నారా..?హుజురాబాద్ టికెట్ కోసం చర్చ జరుగుతోందా..? అంటే గత మూడునాలుగు రోజుల నుంచి పొన్నం పార్టీ మారుతున్నారంటూ జోరుగా సాగుతున్న ప్రచారం..బయటికొస్తున్న లీకులు అవుననే అంటున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీలో గట్టి కౌంటర్ వాయిస్ ఉన్న లీడర్ పొన్నం ప్రభాకర్. అయితే గతకొద్ది రోజులుగా పొన్నం కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో చేరిన వెంటనే పొంగులేటికి ఏఐసీసీ ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా నియమించడం,ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తనకు చోటు దక్కకపోవడంతో పార్టీ మారాలని డిసైడ్ అయినట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గత రెండు మూడ్రోజుల నుంచి ఆ ప్రచారం కాస్త మరింత పీక్స్ కు వెళ్లింది. ఆయనతో పాటు రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పార్టీ వీడుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ టికెట్ ఇస్తామని హామీ వచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. పొన్నం మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నారు.
అయితే పార్టీ మారే విషయం కాస్త పక్కన పెడితే.. ఈ లీకుల వెనుక ఉన్నదెవరు..? అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీనా లేక బీఆర్ఎస్ పార్టీనా..? అన్నది హాట్ టాఫిక్ అయ్యింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను మానసికంగా దెబ్బతీయడానికి పొన్నంతో పాటు మరికొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు లీకులు ఇస్తుందని చర్చ మొదలైంది. మరోవైపు పొన్నం కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయం తెలిసే పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలే సేఫ్ సైడ్ గేమ్ ఆడుతూ ఇలా లీకులు ఇస్తున్నారా..? అనే చర్చ కూడా జరుగుతోంది.
అయితే పార్టీ మారే విషయంలో డైలమాలో పడ్డ పొన్నం తన ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ ప్రస్తానంలో చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచుకోలేక, సోనియా గాంధీతో ఉన్న పరిచయం నేపథ్యంలో పార్టీ వీడేందుకు ఆయన ముందుకు రాలేకపోతున్నట్లు సమాచారం. మరోవైపు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే తన రాజకీయ భవితవ్యం ఏంటనే ఆలోచనలో కూడా ఆయన పడినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ మారిన తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడేంటి..? అనే డైలామాలో కూడా పడ్డారు.. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.
అయితే 2014,2019 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో వరుస ఓటముల నేఫథ్యంలో పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.