Gold Smuggling: దేశంలో ఈ ఏడాది బంగారం స్మగ్లింగ్ కేసులు భారీగా పెరగడంతోపాటు స్మగ్లింగ్ కేసుల్లో బంగారం పట్టుబడడం కూడా పెరిగింది. పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్టోబర్ 2023 వరకు దేశవ్యాప్తంగా 4,798 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను మొత్తం 2022 కేసులతో పోల్చినట్లయితే, ఈ సంఖ్య 20 శాతం ఎక్కువ. మొత్తం 2022 సంవత్సరంలో, దేశంలో 3982 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి మరియు 2022లో కూడా కేసులు 2021 కంటే 63 శాతం ఎక్కువ.
ఇటీవల పార్లమెంట్‌లో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో, ఈ ఏడాది అక్టోబర్ వరకు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ బంగారం ఎక్కువగా అక్రమ రవాణా(Gold Smuggling) జరిగిన ప్రధాన రాష్ట్రాలు అని చెప్పారు. అక్టోబర్ 2023 నాటికి, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో వరుసగా 1,357 కేసులు, 894 కేసులు, 728 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లేహ్, లడఖ్‌లలో బంగారం అక్రమ రవాణాపై మొత్తం 577 కేసులు నమోదయ్యాయి. బంగారం స్మగ్లింగ్‌పై అతి తక్కువగా 2 కేసులు మాత్రమే నమోదైన ఏకైక రాష్ట్రం ఒడిశా.
Also Read: ప్రాపర్టీ కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే టాక్స్ అదిరిపోద్ది
ఈ ఏడాది అక్టోబరు వరకు స్మగ్లర్ల నుంచి మొత్తం 3,917.52 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, 2022లో 3,502.16 కిలోల బంగారం పట్టుబడిందని పంకజ్ చౌదరి తెలిపారు. 2021, 2020లో బంగారం స్మగ్లర్ల నుంచి వరుసగా 2,383.38 కిలోలు, 2,154.58 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండడం.. దానికి తగ్గట్టుగా డిమాండ్ కూడా అధికంగా ఉండడం జరుగుతోంది. అయితే, కొన్ని దేశాల్లో బంగారం ధర చాలా తక్కువ. దానికి తోడు మన దేశంలో బంగారం అమ్మకాలపై టాక్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంగారం దిగుమతులపై పరిమితులు ఉన్నాయి. దీంతో బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) విపరీతంగా పెరిగిపోతోంది. గోల్డ్ స్మగ్లింగ్ అరికట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. చాప కింద నీరులా ఈ వ్యవహారం సాగుతూనే ఉంటోంది. బంగారం స్మగ్లింగ్ ఆపడం కోసం.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదని ఈ స్మగ్లింగ్ లో పెరుగుదల లెక్కలు చెబుతున్నాయి.
Watch this interesting Video: