భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం.. హైఅలర్ట్

వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్లం 50 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వరదలతో మరో 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

New Update
భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం.. హైఅలర్ట్

ముంపు ప్రాంతాల్లో హైఅలర్ట్..

కుండపోత వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 51 అడుగులకు నీటిమట్టం చేరింది. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలు జరుగుతున్నాయి. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు. కన్నాయిగూడెం దగ్గర రోడ్డుపైకి వరద నీరు వచ్చింది. రాయనపేట దగ్గర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు(మం) రెడ్డిపాలెం దగ్గర వరద పోటెత్తింది. వరదలతో మరో 48 గంటలపాటు అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అందుబాటులోకి ఎయిర్‌ఫోర్స్ హెలికాఫ్టర్ తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్ అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

ప్రతి ఏడాది ఇదే సమస్య..

ప్రతి ఏడాది ఇదే సమస్య తలెత్తుతుందని.. వరదల సమయంలో ఇచ్చిన హామీలను నాయకులు మర్చిపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపంతో భద్రాచలం పరిసరాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అనాథ, వృద్ధాశ్రమాలపైనా వరద ఎఫెక్ట్‌ పడింది. మానవసేవ వాలంటరీ అనాథాశ్రమాన్ని అధికారులు ఖాళీ చేయించారు. అనాథుల కోసం సరోజినమ్మ అనే మహిళ ఆశ్రమం నడిపిస్తున్నారు. ప్రతి ఏట ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలోనూ వరద బీభత్సం సృష్టిస్తోంది. నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. దీంతో కాలనీలన్ని నీటమునిగాయి. రాత్రంతా 6నెలల పాపతో.. మూడో ఫ్లోర్లో ఓ కుటుంబం చిక్కుకుంది. గంటపాటు రెస్క్యూ చేసి ఏడుగుర్ని కాపాడారు NDRF సిబ్బంది. మంత్రి పువ్వాడ అజయ్ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.

ప్రజలకు కలెక్టర్ ప్రియాంక విజ్ఞప్తి..

గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి నదికి వరద పోటెత్తడంతో అనేక ప్రాంతాలు గుంపునకు గురవుతున్నాయి. వెంకటాపురం వాజేడు మండలాలలో రోడ్లపైకి భారీగా నీరు చేరుకుంది. వరదల కారణంగా టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదల వల్ల ప్రభావితమయ్యే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం గోదావరి నదికి నీటిమట్టం పెరిగి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక తెలిపారు. గోదావరి ఉప్పొంగుతుండడంతో తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. వరద తగ్గుతుందనే నమ్మకంతో లోతట్టు ప్రాంతాల్లోనే ఉండొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. అత్యవసర సందర్భాలలో కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని ఆమె వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు