గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా నడిచే చాట్ బాట్ సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట ఐటీ మంత్రిత్వ శాఖలో ఈ చాట్ బాట్ సేవలను ప్రవేశ పెట్టనున్నట్టు ఆ శాఖ మంత్రి రోహన్ కౌంతే నిన్న అసెంబ్లీలో వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశంలో మంత్రి రోహన్ మాట్లాడుతూ..... మొదట ఈ చాట్ బాట్ సేవలను పర్యాటక రంగంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార శాఖలో ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు గోవా ఆన్ లైన్ వెబ్ సైట్ లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ద్వారా సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యస్థకు హబ్ గా మారాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు.
వర్కేషన్ గోవా అనే భావనను ముందుకు తీసుకెళ్లేందుకు మోర్జిమ్, అశ్వేమ్, బెనౌలిమ్‌లలో కో-వర్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇది తమ 4ఎస్(సీ, సన్, శాండ్, సాఫ్ట్ వేర్) విజన్ ను మరింత ముందుకు తీసుకు వెళ్తుందని చెప్పారు. డిజిటల్ విభజనను తగ్గించేందుకు, కమ్యూనిటీలను బలోపేతం చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లను ప్రభుత్వం అందిస్తామన్నారు.
కేంద్రం తీసుకు వచ్చిన ఈ డిస్ట్రిక్ట్ మిషన్ లో భాగంగా ఇప్పటికే 35 శాఖలకు చెందిన 227 రకాల సేవలు గోవా ఆన్ లైన్ వెబ్ సైట్ లోకి చేర్చామన్నారు. ఇప్పటి వరకు 6.8 లక్షల మంది రిజస్టర్ట్ యూజర్స్, 22.57 లక్షల ట్రాన్సక్షన్లు జరిగాయన్నారు. పోర్వోరిమ్ లోని గ్రీన్ ఫీల్డ్ ఐటీ హైబ్రీడ్ క్లస్టర్ లో 150 నుంచి 200 చిన్న, మధ్య తరహా కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు.