INDvsAUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అదరగొడుతోంది. భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ శుభమన్ గిల్, వన్ డౌన్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన అయ్యర్ క్రీజులోకి వచ్చిన దగ్గరి నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లను కంగారు పెట్టించాడు. మరోవైపు గిల్ కూడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలోనే ముందుగా అయ్యర్ సెంచరీ కొట్టేశాడు.
కొన్ని రోజులుగా గాయాలతో సతమవుతున్న అయ్యర్.. రీఎంట్రీలో ఇటీవల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. దీంతో జట్టులో అయ్యర్ స్థానంపై సందేహం నెలకొంది. ఈ మ్యాచులో కూడా విఫలమైతే ఇక వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో పక్కన పెట్టడమే అని అందరూ భావించారు. కానీ అయ్యర్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పడిలేచిన కెరటంలా సెంచరీతో తన సత్తా మరోసారి చాటిచెప్పాడు.
ఇక గిల్ కూడా యథాప్రకారం అదరగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు164 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ 37, అయ్యర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ఇదే ఊపులో శ్రేయస్ 86 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో జట్టు స్కోరు 216 పరుగుల వద్ద అబాట్ బౌలింగ్‌లో 105 పరుగులతో ఔటయ్యాడు. అనంతరం గిల్ కూడా సెంచరీ కొట్టి 104 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కూడా ధాటిగా ఆడటండో స్కోర్ 40ఓవర్లలోనే 300 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే 31 పరుగుల వద్ద ఇషాన్ పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 52 పరుగులు చేయడంతో భారత్ 399/5 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్.