Ganesh Chaturthi 2024: ప్రతీ సంవత్సరం గణేష్ చతుర్థి భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సారి సెప్టెంబర్ 7 అంటే ఈరోజు నుంచి చతుర్థి మొదలవుతుంది. నేడు వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నగరాలు, పల్లెల్లోని ప్రతీ వీధుల్లో బొజ్జ గణపయ్య కొలువుదీరాడు. నేడు మొదలైన గణనాథుడి ఉత్సవాలు మరో 15రోజుల వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గణపతి మండపాల దగ్గర భజనలు, కీర్తనలతో కోలాహలంగా ఉంటుంది.
అయితే పురాణాలలో వినాయకచవితి రోజున పూజ చేసిన తర్వాత అక్షింతలు వేసుకోకుండా పొరపాటున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పాలవుతారని చెబుతారు. అసలు చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు..? చూస్తే పరిహారం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము..
చంద్రుడిని ఎందుకు చూడకూడదు
పురాణాల ప్రకారం పార్వతి దేవి తాను స్నానానికి వెళ్ళినప్పుడు.. ఆమెకు కాపలాగా పిండితో చేసిన బాలుడి బొమ్మకు పోసి వాకిట్లో ఉంచి వెళ్తారట. ఇక అదే సమయంలో పార్వతి భర్త పరమశివుడు అక్కడికి వస్తాడు. ఇది తెలియని ఆ బాలుడు శివుడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శివుడు బాలుడి శిరస్సును ఖండిస్తాడు. ఇంతలో బయటకు వచ్చిన పార్వతి దేవి తాను ప్రాణం పోసిన బాలుడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎలాగైనా తనకు ఆ బాలుడు కావాలని భర్తను కోరుతుంది. ఇక పార్వతీ దేవి కోసం శివుడు ఆ బాలుడికి ఏనుగు శిరస్సు అతికించి ప్రాణం పోస్తాడు. ఆ తర్వాత ఆ బాలుడికి గజాననుడు అని నామకరణం చేస్తారు. ఈ గజనానుడునే ఇప్పుడు గణపతిగా ఆరాధిస్తారు.
అయితే ఒకరోజు గణపతి తమ తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించాడు కిందకి వంగలేక పడుతున్న ఇబ్బందిని చూసి చంద్రుడు నవ్వుతాడు. దీంతో ఆగ్రహించిన తల్లి పార్వతీదేవి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని శపిస్తుంది. ఇది తెలుసుకొని దిగి వచ్చిన మహర్షులు.. ఇదేం శాపం తల్లి..? చంద్రుడిని చూడకుంటే ఎలా అని వాపోతారు. దానికి పార్వతీ దేవి చవితి రోజు చూసిన వారికీ మాత్రమే ఉంటుందని తన శాపాన్ని కొంత వరకు ఉపసంహరించుకుంటుంది. అలా చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవు అనే కథ వచ్చింది.
చంద్రుడిని చూస్తే చేయాల్సిన పరిహారం
చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే వినాయకుడి శమంతకమణి కథను విని తల పై అక్షింతలు వేసుకోవాలి. ఇలా చేస్తే నీలాపనిందలు కలగకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు. లేదంటే ఇలా చంద్రుడిని చూసిన వారు తల్లిదండ్రుల పాదాలకు దండం పెట్టుకోవాలని సూచిస్తున్నారు.