Ganesh Chaturthi 2024: దేశవ్యాప్తంగా పేరు గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి పూజల అందుకోవడానికి సిద్దమయ్యాడు. ఖైరతాబాద్ గణేషుడు ఉత్సవాలు ప్రారంభమయ్యి ఈ సంవత్సరంతో 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తు 28అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని రూపొందించారు. ప్రతీ సంవత్సరం ఖైరతాబాద్ విగ్రహ కమిటీ సభ్యులు గణనాథుడి విగ్రహ రూపకల్పనలో విశేష ప్రత్యేకతను చాటుకుంటారు. ఇక ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకతలు
ఖైరతాబాద్ గణపతి ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో కొలువుదీరాడు. 50 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో చూడముచ్చటగా ముస్తాబయ్యాడు బొజ్జ గణపయ్య.
ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి విగ్రహంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం ప్రతిభింబిస్తుంది.
శ్రీ సప్తముఖ మహా గణపతిని 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో ఆకాశాన్నంటేలా తయారు చేశారు. అలాగే మహా గణపతి కుడివైపు పది అడుగుల ఎత్తులో బాల రాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడమవైపు రాహుకేతువులు విగ్రహాలను రూపొందించారు. మహా గణనాథుడి పాదాల దగ్గర మూడు అడుగుల ఎత్తు మూషికాన్ని తీర్చిదిద్దారు.
మహా గణపతికి విగ్రహం వద్ద 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, శివ పార్వతుల కళ్యాణ విగ్రహ ప్రతిమలను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ మహా గణనాథుడి విగ్రహాన్ని శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ తయారు చేశారు.
ఖైరతాబాద్ మహా గణనాథుడి పూజ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలి పూజలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొంటున్నారు.