Vishwak Sen in Gaami Movie Promotions: తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేస్తోంది. యువ దర్శకులు.. నటులు కొత్తదనం తీసుకురావడానికి సాహసిస్తున్నారు. అదిగో ఆలా కొత్తదనం తీసుకురావాలని ప్రయత్నించే వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఈతరం నటుల్లో కమిట్మెంట్ ఉన్న నటుడిగా విశ్వక్ సేన్ ని చెప్పుకోవచ్చు. ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో అంటే దాదాపు ఐదారేళ్ళ క్రితం ఒక సినిమా ఈయన హీరోగా ప్రారంభం అయింది. క్లౌడ్ ఫండింగ్ విధానంలో దీనిని నిర్మించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటి నుంచి షూటింగ్ పడుతూ లేస్తూ సాగి.. ఇబ్బందులు అధిగమించి ఈ నెల 8వ తేదీన విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా గామి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల వదిలారు. ట్రైలర్ చూస్తె సినిమా హాలీవుడ్ రేంజిలో ఉన్నట్టు అనిపించింది. గ్రాఫిక్స్.. బీజీఎం ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరూ గామి సినిమా పై చాలా ఆసక్తి పెంచుకున్నారు.
ఇదిలా ఉంటె ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తరువాత విశ్వక్ సేన్ వరుసగా సినిమా ప్రమోషన్స్ (Gaami Movie Promotions)కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. సినిమాలో తొలిసారిగా అఘోరగా కనిపిస్తున్న విశ్వక్ తన అనుభవాలను చెప్పుకుంటూ రావడంతో పాటు.. సినిమా గురించి ఎన్నో విషయాలు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి చాలా పెద్ద మాట చెప్పారు విశ్వక్. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రేంజ్ టేకింగ్ లా ఈ సినిమా టేకింగ్ ఉంటుంది అని చెప్పారు.
సరిగ్గా ఇలాంటి మాటలే సినిమాపై అంచనాలు ఎంతో పెంచేస్తాయి. కానీ, ఆ అంచానాలు అందుకోలేకపోతే పరిస్థితి ఏమిటి? సినిమాలు ప్రమోట్ చేసుకోవాల్సిందే. కానీ.. ఇంత ఓవర్ అవసరం ఉండదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ఓపెన్ హేమర్, టెనట్ వంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిస్టోఫర్ నోలన్ చాలా గొప్ప దర్శకుడు. అతని టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అయితే, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు సామాన్య ప్రేక్షకులకు అర్ధం కావనేది పచ్చి నిజం. టాలీవుడ్ లో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా అని క్రిస్టోఫర్ నోలన్ టేకింగ్ లాంటి వాటిని అర్ధం చేసుకుని సినిమా చూసేంత ఓపిక ఉన్న జనాలు ఎంతమంది ఉన్నారనేది పెద్ద ప్రశ్న.
Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!
నిజంగా గామి సినిమా ఆ రేంజ్ లో ఉంది ఉండవచ్చు. కానీ, దానిని ప్రమోషన్స్ లో ఇలా చెప్పడం కాస్త అతిగా అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గామి విజువల్ వండర్ గా ఉండే చాన్స్ ఉందని ట్రైలర్ చూసిన వారంతా చెప్పుకుంటున్నారు. అది చాలు సినిమా రీచ్ అవడానికి. మన ప్రేక్షకుల్లో చాలామందికి తెలీని.. తెలిసినా అర్ధం కాని హాలీవుడ్ సినిమాలు.. ఆ దర్శకుల రిఫరెన్స్ వాడుకోవడం అంత మంచి చేయదేమో కాస్త ఆలోచించు విశ్వక్ సేనా అని క్రిస్టోఫర్ నోలన్ టేకింగ్ అంటే పడిచచ్చే అభిమానులు చెబుతున్నారు. సినిమాకి హైప్ తీసుకురావాలంటే చాలా అంశాలు ఉన్నాయి. అవి ట్రైలర్ లో కనిపించాయి. వాటిని హైలైట్ చేస్తే బెటర్.. సినిమా త్వరలో రానున్న సందర్భంలో గందరగోళ పరిచే రిఫరెన్స్ ఎందుకు బాసూ అంటూ విశ్వక్ సేన్ కి సలహా ఇస్తున్నారు విశ్లేషకులు.
ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. తెలుగు సినిమా అంటే అందరికీ రీచ్ కావాలి. టేకింగ్ అయినా.. మేకింగ్ అయినా మన ప్రేక్షకులు అందర్నీ మెప్పించాలి. ఎదో ఒక వర్గాన్ని మెప్పించేలా సినిమా ఉంటే(అంటే క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్లా) టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పడం కష్టం. అందులోనూ ఈ సినిమాకి చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వెనక్కి రావాలంటే.. కచ్చితంగా సినిమా అందర్నీ మెప్పించాలి. విశ్వక్ సేన్ ఎదో ఫ్లో లో అలా అనేసినా.. గామి సినిమా అందరికీ నచ్చేవిధంగా ఉంటుందని ఆశిద్దాం.