తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌కి ఉద్వాసన పలకడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండగా.. శ్రీరక్ష ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

బండి సంజయ్ ఎమోషనల్ స్టేట్‌మెంట్:
అటు బండి అభిమానులు, ఆయన్ను ఇష్టపడేవాళ్లు బీజేపీ నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతుంటాయని ట్వీట్ చేశారు. తన పదవీకాలంలో పొరపాటున ఎవరినైనా బాధించి ఉంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని బండి సంజయ్ కోరారు. తన పదవీకాలంలో విచారించదగ్గ ఘటనలేవీ లేకపోవడం సంతోషించాల్సిన విషయమని బండి చెప్పారు. అందరూ కూడా మర్చిపోలేని మధురానుభూతులు అందించారని థ్యాంక్స్ చెప్పారు. అరెస్టుల సమయంలో, దాడులకు గురైన సమయంలో, ఉల్లాసంగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి నిలిచారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటంలో కార్యకర్తల పాత్ర ఎనలేనిదని, వారికి హేట్సాఫ్ చెబుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు బండి సంజయ్. అరెస్ట్‌లకు, దాడులకు భయపడకుండా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు.
బండి సంజయ్ ఆఫీసు హ్యాండోవర్:
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తర్వాత బండి సంజయ్ తన చాంబర్‌ను హ్యాండోవర్ చేశారు. పార్టీ తనకు కేటాయించిన ఫార్చ్యూనర్ కారును కూడా స్టేట్ బీజేపీ ఆఫీసుకు పంపించారు. గతంలో బండి సంజయ్‌కి కేంద్రం హైకమాండ్ బుల్లెట్ ఫ్రూఫ్ కారు కేటాయించింది. ఆ స్పెషల్ వెహికల్ కోసం పార్టీ తరఫు నుంచి రెండు కోట్లు ఖర్చు చేసింది. వీటన్నిటినీ బండి సంజయ్ పార్టీ ఆఫీస్‌కు అప్పగించేశారు. ఇదంతా ఆయన్ను చాలా ఎమోషనల్ చేసి ఉంటుంది. నిజానికి కొద్దీ రోజులుగా బండి సంజయ్ చాలా బావోద్వేగానికి లోనవుతూ కనిపించారు. వరంగల్ మోదీ సభకు అధ్యక్షుడి హోదాలో రానేమోనంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఆయన రాజీనామా చేయడాన్ని బండి సంజయ్‌ని ఇష్టపడేవాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.