గద్దర్ ప్రజా పార్టీ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు గద్దర్ తెలిపారు. 77 ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజా పార్టీ పెట్టానని వెల్లడించారు. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న పార్టీ అని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలన్నారు. ఇప్పటి వరకు అజ్ఞాత వాసం నుంచి ప్రజలను చైతన్యం చేశానని..ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరానని చెప్పారు. ఓట్ల యుద్దంలోకి దిగానని చెప్పారు. తాను ఏర్పాటు చేస్తున్న గద్దర్ ప్రజా పార్టీ ఒక తెలంగాణదే కాదని.. దేశంలోని ఒక పార్టీగా నిర్మాణం చేసేందుకు తాను బుద్దుడిలా కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ కోసం నా పార్టీ..
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని గద్దర్ అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పుచ్చి పోయిన తెలంగాణ చేశారని మండిపడ్డారు. ధరణి పేరుతో సీఎం కేసీఆర్ భూములు మింగాడని మండిపడ్డారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదని విమర్శించారు. తెలంగాణలో దొరల పరిపాలన జరుగుతోందన్నారు.
పార్టీ జెండా ..అజెండా
గద్దర్ ప్రజా పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉండనున్నట్టుగా సమాచారం. జెండా మధ్యలో పిడికిలి గుర్తును పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేష్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.నెల రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గద్దర్ ప్రజా పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.