India Announces Global Biofuel Alliance: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న జి20 శిఖరాగ్ర సమావేశం(G-20 in India) కీలక ప్రకటనకు వేదికగా మారింది. ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో.. ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిన భారత్.. ఆ దిశగా ఓ కీలక ప్రతిపాదన చేసింది. ప్రపంచ జీవ ఇంధన కూటమిని(Global Biofuels Alliance) ఏర్పాటు చేస్తున్నట్లు G-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించింది భారత్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కూటమికి సంబంధించిన కీలక వివరాలను సమావేశంలో ప్రస్తావించారు. జీవ ఇంధనాల అభివృద్ధి, వినియోగం విషయంలో ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందంటూ జి20 సభ్యలకు దేశాలకు పిలుపునిచ్చారాయన. సరికొత్త జీవ ఇంధనాల అభివృద్ధికి ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చిన మోదీ.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలన్నారు. జీవ ఇంధనాల విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడం తక్షణావసరం అని పేర్కొన్న ప్రధాని మోదీ.. ఈ నేపథ్యంలోనే 'ప్రపంచ జీవ ఇంధన' కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
జి20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన 'ఒకే భూమి' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రపంచ జీవ ఇంధన కూటమికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం వరకు కలపాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. లేనిపక్షంలో ఇతర ప్రత్యామ్నాయ మిశ్రమాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా మనం ప్రయత్నించొచ్చని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా చేయడం వలన పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే, ఇంధన సరఫరాకు లోటు లేకుండా చూడటానికి ఆస్కారం లభిస్తుందన్నారు ప్రధాని.
ప్రస్తుతం పర్యావరణంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఇంధన పరివర్తన సాధించడం ఈ శతబ్ధానికి అత్యంత కీలకం అన్నారు. లేదంటే భవిష్యత్ తరాల వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే, సమ్మిళిత ఇంధన పరివర్తన కోసం ట్రిలియన్లకొద్దీ వ్యయం అవనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 100 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అభివృద్ధి చెందిన దేశాలు ప్రకటించాయి. ఈ దేశాలు ఇలా సానుకూలంగా చొరవ చూపడంతో ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read:
Ram Mandir: రామ మందిరంపై బిగ్ అప్‌డేట్.. ఓపెనింగ్ డేట్ ఇదే..