- స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు అన్ని సెక్టార్లలో కంపెనీ
- ఇండియాలోనే వీటిని తయారు చేసేందుకు ప్లాంట్ల ఏర్పాటు
- తెలంగాణ, కర్నాటకలో ప్లాంట్లు పెట్టేందుకు తాజాగా ఒప్పందాలు
- ఇప్పటికే తెలంగాణలో స్టార్ట్ అయిన ఫాక్స్‌కాన్ ప్లాంట్ గ్రౌండ్ వర్క్
ఫాక్స్‌కాన్ ఇండియాపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తమిళనాడు ప్లాంట్‌ను విస్తరించడమే కాకుండా.. తాజాగా తెలంగాణ, కర్నాటకలో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ ప్లాంట్ ఉంది. ఇక్కడ షావోమి వంటి కంపెనీల కోసం స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తోంది. వేదాంతతో కలిసి చిప్‌ల తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉంది. వాచ్‌లు, హెడ్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లను కూడా తయారు చేయడానికి వెంచర్లను ఏర్పాటు చేస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కోసం ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను పెడతామని తాజా యాన్యువల్ రిపోర్ట్‌లో ఫాక్స్‌కాన్ పేర్కొనడం విశేషం. ఫాక్స్‌కాన్ కేవలం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లను తయారు చేయడమే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇస్తోందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నైల్ షా పేర్కొన్నారు. ఆటో ఇండస్ట్రీని మార్చాలనే ఆలోచనలో ఈ కంపెనీ ఉందని చెప్పారు. మొబిలిటీపై ఫాక్స్‌కాన్ తాజాగా ఫోకస్ పెట్టిందని, ఈవీ ఎకోసిస్టమ్‌లో ఆండ్రాయిడ్ మాదిరిగా మారాలని చూస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇండియాలో భారీగా డిమాండ్
‘అతిపెద్ద కన్జూమర్ మార్కెట్ కావడం, మేకిన్ ఇండియా వంటి ప్రభుత్వ ఇనీషియేటివ్‌ల కారణంగా అనేక కంపెనీలు ఇండియాలో ప్లాంట్లను పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుండడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతుండడం, ప్రభుత్వ రాయితీలు, లాజిస్టిక్స్, సప్లయ్ చెయిన్‌లో సమస్యలు పరిష్కారమవుతుండడం, ట్యాలెంట్ ఉండడం వంటి అంశాలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి’అని బైన్ అండ్ కో పార్టనర్ దీపక్ జైన్ అన్నారు. ఇండియా ఈవీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. డిమాండ్ బాగుండడం, రెగ్యులేటరీ పరంగా ఇబ్బందులు తక్కువగా ఉండడంతో కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే ఈ సెక్టార్‌లో విస్తరించి ఉన్నాయని, దీంతో ఈవీ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారడానికి ఇండియాకు అవకాశం ఉందని జైన్ వివరించారు.
ఇండియాలో విస్తరించేందుకు ఫాక్స్‌కాన్ వ్యూహం
ఇండియాలో భారీగా విస్తరించాలని ఫాక్స్‌కాన్ ప్లాన్స్ వేస్తోంది. కంపెనీ చైర్మన్ యంగ్ లీ దేశంలో ఇప్పటికే రెండుసార్లు పర్యటించారు. ఈ ఏడాది మార్చిలో పర్యటించినప్పుడు తెలంగాణలో 500 మిలియన్ డాలర్లు (రూ.4 వేల కోట్లు), కర్నాటకలో రూ.8 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించారు. నెల కిందట తెలంగాణలోని కొంగర కలాన్‌లో ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ‘ఫాక్స్‌కాన్ అన్నిచోట్ల ఉండాలని, అన్ని చేయాలని అనుకుంటోంది. బ్యాటరీ స్వాపింగ్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, చిప్ మాన్యుఫాక్చరింగ్, ఈవీలు, వియరబుల్స్ ఇలా చాలా సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది’ అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ చైనాలోని తమ ప్లాంట్ కెపాసిటీని పెంచుతోంది.