చదువు అనేది కేవలం ర్యాంకుల కోసం కాదు..విజ్ఙానం, వివేకాన్ని పెంచుకోవడం కోసమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన సోమవారం ఉదయం గుంటూరులో భాష్యం విద్యాసంస్థల విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇష్టపడి, కష్టపడి చదవాలన్నారు. కులాల కుమ్ములాటలో యువకులు దూరవద్దని సూచించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని.. కొత్త విద్యా విధానంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారని వెంకయ్య తెలిపారు. చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. మన దేశం ఇప్పుడు అంతరిక్ష పరిశోధనల్లో దూసుకు వెళ్తుందని అన్నారు.
తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, రుషి షునాక్ వంటి వారు భారతదేశ ప్రతిష్టను పెంచారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన భాష్యంలో చదివి జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో అఖిలభారత స్థాయి ఓపెన్ కేటగిరీ 5, 10వ ర్యాంకు సాధించిన విద్యార్థులను మాజీ ఉపరాష్ట్రపతి సన్మానించారు.
సేవ చేయడం కోసం రాజకీయాలు కీలకమన్నారు. విద్య అందించడం కూడా సేవలో భాగమే అని తెలిపారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్నారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు బానిసలు కావద్దని సూచించారు.
సాంకేతికత అవసరమే కానీ పూర్తిగా దానిమీదే ఆధార పడవద్దన్నారు. చిన్న చిన్న సమాచారం కోసం కూడా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.