Prajwal Revanna: దేవెగౌడ మనవడికి గట్టి షాక్‌.. ఎంపీగా అనర్హుడని ప్రకటించిన కర్ణాటక హైకోర్టు

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు జనతాదళ్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ చెబుతూ ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది.

Prajwal Revanna: దేవెగౌడ మనవడికి గట్టి షాక్‌.. ఎంపీగా అనర్హుడని ప్రకటించిన కర్ణాటక హైకోర్టు
New Update

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్)నేత ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ చెబుతూ ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని హసన్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రజ్వల్ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే రేవణ్ణ తన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచారని బీజేపీ అభ్యర్థి అర్కలగూడు మంజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజ్వల్ తన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని.. తన ఆదాయాన్ని రూ. 24 కోట్లకు పైగా తక్కువ చూపించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై నాలుగన్నర సంవత్సరాల పాటు విచారణ జరిగింది.

తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనంటూ న్యాయస్థానం తేల్చింది. అనంతరం ఎంపీగా ఆయన ఎన్నిక చెల్లదంటూ తుది తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా వచ్చే 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2019 ఎన్నికలలో జేడీఎస్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన నాయకుడు ఏకైక నేత ప్రజ్వల్ కావడం విశేషం. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ పార్టీ నుంచి లోక్‌సభకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రజ్వల్ వయసు 33 సంవత్సరాలు మాత్రమే.. పార్లమెంటులో అత్యంత పిన్న వయసున్న ఎంపీల్లో మూడో వ్యక్తిగా ఉన్నారు.

మరోవైపు ప్రజ్వల్‌పై అనర్హత వేటు నేపథ్యంలో తనను ఎంపీగా ప్రకటించాలన్న మంజు అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. మంజు కూడా ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని హైకోర్టు తెలిపింది. అలాగే ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన ప్రజ్వల్ తండ్రి, ఎమ్మెల్యేహెచ్‌డీ రేవణ్ణ.. సోదరుడు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణతోపాటు మంజుపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి