JD Lakshmi Narayana: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జాతీయ జెండా రంగులతో లక్ష్మీనారాయణ ఫొటోతో కూడిన పార్టీ జెండాను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తమ పార్టీ పెట్టిన పార్టీ కాదని, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, మెడలు వంచి తాము దాన్ని సాధిస్తామని స్పష్టంచేశారు. ఎవ్వరికీ తలవంచబోమని, ఎక్కడా సాగిలపడబోమని అన్నారు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకూ పరిష్కారమన్న అంబేద్కర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.
లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటనతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతుండగా.. మేమూ బరిలో ఉన్నామంటూ దూసుకొచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ.
ఇది కూడా చదవండి: హరిరామజోగయ్య లేఖకు పవన్ రిప్లై.. సీఎం అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు!
దీంతో పాటు మరికొన్ని కొత్త పార్టీలూ ఆవిర్భవిస్తున్నాయి. ‘తెలుగు సేన పార్టీ‘ పేరుతో ప్రముఖ నిర్మాత సత్యారెడ్డి కొత్త పార్టీ ప్రకటించారు. అనంతరం కొన్ని గంటల్లోనే లక్ష్మీనారాయణ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ ప్రకటన వెలువడింది. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో పార్టీని ప్రకటించిన ఆయన ఏడాది క్రితమే ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును నమోదు చేయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ పలు వేదికలపై బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయన జనసేనలో చేరి పోటీలో ఉంటారని అందరూ భావించగా; తాజాగా ఆయనే సొంత పార్టీ పెట్టారు. ఆయన పార్టీ గమనం, రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో వేచిచూడాలి.