/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/LUCKNOW-jpg.webp)
వచ్చే ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది. కంగారు జట్టుకు ఆడిన గొప్ప ఆటగాళ్లలో లాంగర్ ఒకడు. అతడి కోచింగ్‌లో ఆస్ట్రేలియా 2021లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు బిగ్‌బాష్ లీగ్‌లోనూ కోచ్‌గా పెర్త్ స్కార్చర్స్ టీమ్‌కు ట్రోఫీని అందించాడు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్‌ను సలహాదారుగా నియమించుకుంది. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్‌గా పనిచేయడంతో పాటు గతంలో ఇండియా జట్టుకు ఆడిన అనుభవం కూడా పనికొస్తుందని లక్నో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి తమ జట్టుకు (స్ట్రాటజిక్ కన్సల్టెంట్ వ్యూహాత్మక అంశాల సలహాదారుడిగా ఎమ్మెస్కే సేవలు అందిస్తాడని ఓ ప్రకటనలో తెలిపింది.
Former India cricketer MSK Prasad joins the Super Giants as our Strategic Consultant! 🤝
Full story 👉 https://t.co/kwtmp8awBE pic.twitter.com/gW9kiQJePM
— Lucknow Super Giants (@LucknowIPL) August 17, 2023
లక్నో సూపర్ జెయింట్స్ గత ఐపీఎల్ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొత్తం 14 మ్యాచుల్లో 8 విజయాలు, 5 ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోపిని ముద్దాడాలని భావిస్తోంది. ఈ మేరకు జట్టు కోచింగ్ విభాగంలో కీలక మార్పులు చేస్తోంది. ఆర్పీఎస్జీ(RPSG)స్పోర్ట్స్ విభాగంలో ప్రసాద్ సేవలు కీలకంగా మారతాయని భావిస్తున్నామని తెలిపింది. ప్రతిభను అన్వేషించే విభాగానికి అధిపతిగా, ఆటగాళ్లు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునే అంశంలో సలహాదారుగా మార్గనిర్దేశం చేస్తాడని లక్నో ఫ్రాంచైజీ పేర్కొంది.
ఇక 2016 నుంచి 2020 వరకు టీమిండియా మెన్స్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెస్కే వ్యవహరించాడు. ఆయన హయాంలోనే మెన్ ఇన్ బ్లూ 2019 వర్డల్ కప్ ఆడింది. అయితే ఆ టోర్నీకి జట్టు ఎంపిక విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా తెలుగు ఆటగాడైన అంబటి రాయుడుని ఎంపిక చేయకపోవడం తీవ్ర దుమారం రేపింది. రాయుడు స్థానంలో విజయ్ శంకర్‌ని సెలెక్ట్ చేశారు. దీంతో రాయుడు 3డీ అద్దాలు వేసుకుని మ్యాచులు చూస్తానని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అనంతరం వెంటనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. మొత్తానికి ఆ ఎపిసోడ్ ఇద్దరు తెలుగు వ్యక్తులు మధ్య వార్‌గా మారింది. 1998-2000 మధ్య కాలంలో భారత్ జట్టు తరఫున 6 టెస్టులు, 17 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు ఎమ్మెస్కే ప్రసాద్.