వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద, బురదతో పాటు రోగాలు(diseases) కూడా కళ్ల ముందు వాలిపోతాయి. ఎవర్ని కదిలించినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లెమ్ చెబుతుంటారు. జ్వరమని.. డెంగీ అని.. వైరల్ ఇన్ఫెక్షన్ అని ఇలా ఏదో ఒక సమస్యతో బాధ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరుణుడు ప్రతాపం చూపిస్తుండడంతో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తుండడంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్‌లో ముఖ్యంగా కళ్ల కలక(Pink eye) కేసులు పెరుగుతున్నాయి. మనకు తెలిసిన వాళ్లలోనే ఎవరో ఒకరు తమకు కళ్ల కలక వచ్చిందని చెబుతున్న విషయాలు వింటునే ఉన్నాం.
ఎందుకిలా జరుగుతోంది?
ప్రస్తుతం ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు కళ్ల కలక కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలు. హైదరాబాద్‌కు చెందిన ఎల్వీ ప్రసాద్ ఐ(eye) ఇన్స్టిట్యూట్(LVPEI)కి చెందిన డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కళ్లకలక కేసులు పెరుగుతున్నాయని.. ఎక్కువగా చలి, తడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఒక్క జూలైలోనే LVPEI డాక్టర్లు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1,000మంది కళ్లకలక బాధితులకు చికిత్స అందించారు. ఇది అడెనోవైరస్ లాంటి వైరస్ల గ్రూప్ వల్ల వస్తుంది.

‣ లక్షణాలు: కళ్ల ఎరుపు, దురద, లైట్ సెన్సిటివిటీ, అస్పష్టమైన దృష్టి, కొన్ని సందర్భాల్లో జ్వరం గొంతు నొప్పి కూడా వస్తుంది.
‣ కలుషితమైన వేళ్ల (fingers) ద్వారా లేదా కలుషితమైన వస్తువుల ద్వారా కళ్లకలక సంక్రమిస్తుంది.
ప్రాథమిక జాగ్రత్తలు:
➡ కళ్లకలక సోకిన వ్యక్తులు తప్పనిసరిగా ఇతర కుటుంబ సభ్యులు, బయట ప్రపంచానికి దూరంగా ఉండాలి.
➡ తరచుగా చేతులు కడుక్కోవడం, తరచుగా కళ్లను తాకడం, వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోండి.
➡ టవల్స్, మేకప్, దిండ్లు లేదా కాంటాక్ట్ లెన్స్‌ల లాంటి వాటిని అసలు షేర్ చేసుకోవద్దు.
➡ సపోర్టివ్ థెరపీ, వార్మ్ కంప్రెస్‌లు, లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, అనాల్జెసిక్స్ లాంటి విషయల్లో కూడా డాక్టర్ల సలహా తీసుకోండి.
➡ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌తో సెల్ఫ్ ట్రీట్మెంట్ వద్దు.

⦾ ముఖ్య విషయం: ఇది గాలిలో వ్యాపించే వ్యాధి కాదు కాబట్టి కళ్లకలక ఉన్న వ్యక్తిని చూస్తే అది వ్యాపించదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధిత వ్యక్తికి సంబంధించిన వాటిని షేర్ చేసుకుంటే సంక్రమిస్తుంది కానీ చూస్తేనే వ్యాపించదు. అసలు బాధితులను చూడకుడదని, మాట్లాడకుడదనే ప్రచారాలను అసలు నమ్మవద్దు. ఇది త్వరగా నయమైపోయే సమస్య. లేనిపోని భయాలతో బాధితుడిని మెంటల్‌గా డౌన్ చేయవద్దు.. ధైర్యాన్ని నింపండి. ఇక అలెర్జీల వల్ల వచ్చే కళ్లకలక అంటువ్యాధి కాదు. అందుకే బాధిత వ్యక్తులు అసలు తమకు కళ్లకలక ఏ కారణంతో వచ్చిందో తెలుసుకోవడం మంచిది.