ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. ఆ వరదలోనే గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. గ్రామాల్లోని మట్టి మిద్దెలు పూర్తిగా నానిపోవడంతో ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం మధ్య జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు.
బుధవారం రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి పరకాల రహదారిపై మొరంచపల్లి దగ్గర 15 అడుగుల ఎత్తులో ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద మొంచెత్తుతోంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో గ్రామస్తులు బిల్డింగులు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే వరద ప్రవాహం పెరుగుతూనే పోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
దీంతో తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో సుమారుగా వెయ్యికి పైగా జనాభా ఉంది. అధికారులు సహాయకచర్యలు మొదలుపెట్టారు. అయితే మరో రెండ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించడంతో గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యం వాగులు, వంకలకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో జనం వణికిపోతున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రా భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది.
హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, వరంగల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.