రోడ్డు, రైలు ప్రయాణాలు కామన్ గా చేస్తుంటాం. కానీ విమానం ఎక్కడం మాత్రం కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. కొందరైతే అసలు విమానం జోలికే వెళ్లరు. దీనికి ప్రధాన కారణం టికెట్ ధరలు. ఓ వ్యక్తి విమానం ఎక్కాలంటే తక్కువలో తక్కువ 1000 రూపాయలైనా ఛార్జ్ ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు విమాన ప్రయాణాల జోలికి వెళ్లరు.అయితే అందరికీ విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ (UDAN) అనే అద్భుతమైన స్కీమ్ అమలు చేస్తూ వస్తోంది. ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహించడంతో పాటు సాధారణ ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసేలా ఈ పథకం రూపొందించారు.
ఈ ఉడాన్ పథకాన్ని 2016 అక్టోబర్ 21 వ తేదీన అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల దేశంలోని పలు నగరాలకు విమాన టికెట్ల రేట్లు భారీగా తగ్గాయి. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్- ఆర్‌సీఎస్‌లలో చేరే విమానయాన సంస్థలు 50 నిమిషాలలోపు ప్రయాణం పూర్తయ్యే రూట్లలో టికెట్ల ధరలను చాలా తగ్గించారు. UDAN కింద ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది.ఈ క్రమంలోనే అలయన్స్ ఎయిర్‌లైన్స్ రూ.150 లకే విమాన టికెట్ అందిస్తోంది. అస్సాంలోని లీలాబరి నుంచి తేజ్‌పూర్ నగరాల మధ్య అలయన్స్ ఎయిర్‌లైన్స్ కేవలం రూ.150కే విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రయాణ దూరం 186 కిలోమీటర్లు.
రూ.150 అనేది బేస్ ఫేర్. దీనికి కన్వీనియన్స్ ఫీజు, జీఎస్టీ, ఇతర ట్యాక్స్‌లు అదనంగా చెప్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి మరో 325 రూపాయలు అవుతాయి. దీంతో మొత్తం ఛార్జ్ రూ.475 అవుతుంది. ఈ ఫేర్ సాధారణ ప్రజలకు, మధ్య తరగతి వర్గాలకు ఆకర్షణీయమైనది అని చెప్పుకోవచ్చు.కాగా.. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో కింద విమానాలు నడిపే ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందుతాయి. విమానాలకు ల్యాండింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు ఉండవు. అందుకే ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలు విమాన టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. ప్రస్తుతం దేశంలో పలు రూట్లలో ఈ టికెట్ ధరలు అమలులో ఉన్నాయి.