కదం తొక్కుతున్న రైతులు.. రోడ్డుపైనే వంటా వార్పు

New Update
కదం తొక్కుతున్న రైతులు.. రోడ్డుపైనే వంటా వార్పు

మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు రైతన్నలు. హర్యానా కురుక్షేత్రలో కదం తొక్కుతున్నారు. పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ.. ఢిల్లీ, హర్యానా నేషనల్​ హైవేను దిగ్బంధించారు. కురుక్షేత్ర జిల్లా పిప్లి గ్రామంలో మహా పంచాయత్‌ నిర్వహించారు. ఐతే వారిని పోలీసులు అడ్డుకోవడంతో..రాత్రంతా రోడ్డుపైనే బైఠాయించారు. అక్కడే వంటా వార్పు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు.

Farmers block Delhi-Haryana national highway over demand for MSP for sunflower seed

మద్దతు ధర ఇవ్వండి.. రైతును కాపాడండి పేరుతో నిర్వహించిన మహాపంచాయతీలో హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ మహాపంచాయతీలో రెజ్లర్ బజరంగ్ పూనియా, రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ కూడా పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంతకుముందు ప్రకటించిన MSP ధరకే సన్‌ఫ్లవర్‌ను సేకరించాలని డిమాండ్‌ చేశారు. వారంతా ఢిల్లీకి తరలివెళ్తుండటంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. 2023-24 సీజన్‌లో సన్‌ఫ్లవర్‌కు ఎంఎస్‌పీని రూ.6,400 నుంచి రూ.6,760కి పెంచింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రంలో 36,414 ఎకరాల్లో సాగు చేసిన 8,528 మంది రైతులకు రూ.29.13 కోట్లు తాత్కాలిక సాయం విడుదల చేశారు. కానీ, ఈ సాయం పట్ల రైతులు సంతృప్తి చెందలేదు. మరోవైపు, తమ డిమాండ్లను పరిష్కరించకపోతే, తాము తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతులు హర్యానా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలును ఇప్పుడు హర్యానా ప్రభుత్వం ఎందుకు చేయడం లేదనేదే తమ ఆందోళనకు కారణమంటున్నారు రైతు సంఘాల నేతలు. దాంతో పాటు కనీస మద్దతు ధర, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. "గతంలో రైతుల కోసం 13 నెలల పాటు దేశవ్యాప్తంగా ఆందోళన చేశాం. ఇప్పుడు అంతే శాంతియుతంగా నిరసన కొనసాగిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా వ్యవహరిస్తూ నిరసనకారుల గొంతు నొక్కాలని చూస్తోందీ ప్రభుత్వం" అంటూ ఆరోపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు