భారత దేశంలో సెంటిమెంట్ కు చాలామంది జనాలు నమ్ముతారనే విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరికీ బట్టలు, వెహికిల్స్, ఇళ్లు వంటివాటితో అనుబంధం ఉంటే.. మరికొందరికీ విచిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి. అయితే తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన పని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ఫకీర్ బాబాతో నడి రోడ్డుమీద చెప్పుదెబ్బలు తిన్న ఓ వింత సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
అసలు విషయానికొస్తే.. నేడు మధ్యప్రదేశ్ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పరాస్ సక్లేచా పోటీచేస్తున్నారు. అయితే తన గెలుపుకోసం ఓ బాబాతో చెప్పుతో కొట్టించుకున్నారు. పరాస్ ముందుగా ఓ జత కొత్త చెప్పులు కొనుక్కొని.. రోడ్డు పక్కన ఉండే ఫకీర్ బాబా వద్దకు వెళ్లారు. అతడికి ఆ చెప్పులు ఇచ్చి వాటితో కొట్టించుకున్నారు. తలపై, చెంపపై ఎలాపడితే అలా కొట్టించుకున్నారు. ఈ వింత సెంటిమెంట్ చూసిన జనాలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఉదయం 6 గంగలకే పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, మండ్ల, దిందోరి జిల్లాలో కేవలం 3 గంటల వరకే పోలింగ్ జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64, 626 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 2533 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా మధ్యప్రదేశ్‌లో 47 స్థానాలను ఎస్టీ, 35 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేశారు.