ఇస్రో చంద్రయాన్ -3(Chandrayaan-3) ప్రయోగం ద్వారా మూడు లక్ష్యాలను పెట్టుకుంది. అందులో మొదటిది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్(Lander)ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం..ఇది ఇప్పుడు పూర్తయింది. ఇక మిగిలినవి రెండు లక్ష్యాలు. అందులో ఒకటి చంద్రుడి ఉపరితలంగా చెప్పుకునే రెగోలిత్ మీద రోవర్(rover) దిగి, సంచరించడం. ఇక మూడోది ల్యాండర్, రోవర్‌లు కలసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడం.
గ్రహాల అన్వేషణ కోసం:
చంద్రయాన్-2లో ఎదురైన సాంకేతిక లోపాల్ని దృష్టిలో ఉంచుకుని..చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ల్యాండర్‌లో అత్యాధునిక టెక్నాలజీని అమర్చింది ఇస్రో. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో ఏడు రకాల పరికరాలు అమర్చింది. వీటిలో ల్యాండర్‌లో నాలుగు, రోవర్లో రెండు, ప్రొపల్షన్ మాడ్యూల్‌లో ఒక పరికరం ఉన్నాయి. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి మీద ల్యాండయ్యే ల్యాండర్. రోవర్లను చంద్రుడి ఉపరితలంపై వంద కిలోమీటర్ల ఎత్తు వరకూ తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడింది. 2 వేల 145 కేజీల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్‌లో...1696 కేజీల ఇంధనం ఉంటుంది. దీనిసో షేప్ అనే పరికరాన్ని అమర్చింది. షేప్ అంటే...స్పెక్ట్రో పొలామెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెటరీ ఎర్త్ అని అర్థం. అంటే ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతూనే...సుదూర విశ్వంలో భూమి లాంటి జీవం ఉన్న గ్రహాల అన్వేషణను కొనసాగిస్తుంది. ఇది చంద్రుడి చుట్టూ మూడు నుంచి ఆరు నెలల వరకూ పరిభ్రమిస్తుందని ఇస్రో అంచనా వేస్తోంది.
చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో కమ్యూనికేట్:
చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్‌లో ల్యాండర్, రోవర్‌లు ఉన్నాయి. ఈ రెండు చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ల్యాండయిన తర్వాత వాటి జీవితం కాలం ఒక లూనార్ డే. అంటే చంద్రుడి మీద ఒక రోజు పాటు పరిశోధనలు చేయనున్నాయి. చంద్రయాన్ 3 కమ్యూనికేషన్‌లో ల్యాండర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్‌తో ఇది కమ్యూనికేట్ చేస్తుంది. రోవర్‌తో పాటుగా, చంద్రయాన్-2లో ప్రయోగించిన ఆర్బిటర్‌తో కూడా కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్‌లో కీలకమైన పేలోడ్స్‌ని ఇస్రో అమర్చింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. రేడియో అనాటమి ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్పియర్... దీనినే షార్ట్‌కట్‌లో రంభా అని పిలుస్తారు. ఈ పరికరం చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా సాంద్రతను పరిశీలిస్తుంది. అంటే అక్కడ ఉన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల స్థాయిని, కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పులను ఇది అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తుంది.
పరిశోధనలు చేయనున్న పరికరాలు:
ఇక ల్యాండర్లో అమర్చిన మరో కీలకమైన పరికరం...చంద్రాస్ సర్ఫేస్ థెర్మో ఫిజికల్ ఎక్సపెరిమెంట్. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉన్న చంద్రుడి ఉపరితలంపై థెర్మల్ ప్రాపర్టీలను అధ్యయనం చేస్తుంది. ఇక ల్యాండర్లో అమర్చిన మరో కీలక పరికరం... ఇల్సా. అంటే ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సైస్మిక్ యాక్టివిటీ. ఇది చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశంలో సంభవించే సిస్మిక్ యాక్టివిటీని పరిశోధిస్తుంది. వీటితో పాటు LRA అనే మరో పేలోడ్‌ను కూడా ల్యాండర్లో అమర్చారు. LRA అంటే లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అర్రే..ఇది చంద్రుడి డైనమిక్స్ పరిశీలిస్తుంది. ఈ నాలుకు పరికరాలు చంద్రుడి ఉపరితలం మీద పరిశోధనలు చేస్తాయి. ఈ పరికరాలు పనిచేయడానికి విద్యుత్ కావాలి. చంద్రయాన్ 3 ల్యాండర్లో బ్యాటరీలతో పాటు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సోలార్ ప్యానెళ్లు అమర్చారు. ఒకవేళ ల్యాండర్ సూర్య రశ్మి పడే వైపు కాకుండా వేరే దిశలో ల్యాండయినా ఇబ్బంది లేకుండా..ల్యాండర్‌కు మూడు వైపులా సోలార్ ప్యానెళ్లు అమర్చారు. ఇక నాలుగో వైపు రోవర్ సురక్షితంగా బయటకు వచ్చేందుకు వీలుగా ర్యాంప్ అమర్చారు.
చంద్రయాన్ -2లో కానీ, చంద్రయాన్-3లో కానీ కీలకమైన అంశం..రోవర్. చంద్రుడి మీద ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత...దాని నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలం మీద తిరుగాడుతూ పరిశోధనలు చేయడం చాలా కీలకమైన అంశం. చంద్రయాన్ 3లో ఉన్న ల్యాండర్ కేవలం 26 కిలోల బరువుంటుంది. దీనికి ఆరు చక్రాలుంటాయి. ఇందులో కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెల్‌తో పాటుగా, బ్యాటరీ కూడా ఉంటుంది. 91.7 సెంమీ పొడవు, 75 సెం.మీ వెడల్పు, 39.7 సెంమీ ఎత్తు ఉన్న రోవర్ తనకున్న ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై కదులుతుంది. పరిమాణం, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇరత పరిమితుల దృష్ట్యా ఈ రోవర్ కేవలం ల్యాండర్‌తో మాత్రమే కమ్యూనికేట్ చేయగలుగుతుంది. అంటే అది సేకరించిన ఇన్ఫర్మేషన్‌ను ల్యాండర్‌కు పంపిస్తే..ల్యాండర్ దానిని భూమ్మీద ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు పంపిస్తుంది.
లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అంటే:
రోవర్‌లో రెండు కీలక పరికరాలున్నాయి. వాటితో మొదటిది ప్రధానమైనది. LIBS. అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్. ఇది ఒక ప్రదేశంలో ఉన్న మూలకాలను..వాటి లక్షణాలను గుర్తించడానికి వాడే అత్యాధునిక విధానం. ఈ LIBS పరికరం...చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఫెర్రం వంటి మూలాకాల ఉనికిని గుర్తిస్తుంది. రోవర్‌లో అమర్చిన మరో పరికరం APXS. అంటే అల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్. ఇది చంద్రుడి ఉపరితలంలో ఉన్న మట్టి, రాళ్లలోల సమృద్ధిగా ఉన్న రసాయన సమ్మేళనాలను గుర్తిస్తుంది. దీని వల్ల చంద్రుడి ఉపరితలం గురించి, అక్కడి మట్టి గురించి మరింత అవగాహన పెంచుకోవడం ద్వారా... మరింత వేగంగా భవిష్యత్ ప్రయోగాలకు కొనసాగించవచ్చు.
చంద్రయాన్ - 3 లోని ల్యాండర్ కానీ, రోవర్ కానీ, ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నింట్లో అమర్చిన పరికరాలు పనిచేయడానికి, వాటి నుంచి సమాచారం భూమ్మీద ఉన్న డీప్ స్పేస్ నెట్ వర్క్‌కు పంపడానికి కానీ విద్యుత్ అవసరం. ఈ విద్యుత్ వాటికి సోలాప్ ప్యానెళ్ల నుంచే వస్తుంది. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అయ్యే సమయానికి సరిగ్గా ల్యాండర్ మాడ్యూల్‌ను ఇస్రో ల్యాండ్ చేసింది. ఎందుకంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే.. భూమ్మీద 14 రోజులకు సమానం. చంద్రుడి మీద ఒక రోజు అంటే భూమ్మీద 28 రోజులకు సమానం. చంద్రుడి మీద సూర్యరశ్మి పడే పగటి సమయం అంటే భూమ్మీద 14 రోజుల పాటు మాత్రమే అక్కడున్న ల్యాండర్, రోవర్లకు విద్యుత్ అందుతుంది. కాబట్టి అవి ఆ 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి.