Explainer : అద్దె ఇంటి నుంచి లక్షల కోట్లు వరకు.. బిజినెస్ టూ బాలీవుడ్ వరకు.. సుబ్రతారాయ్ సక్సెస్, ఫెయిల్యూర్ స్టోరీలివే..!! ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. కానీ నేల మీద మాత్రం మన మూలాలను కోల్పోకూడదు. ఒకవేళ ఆ మూలాలు బలహీనంగా ఉంటే మాత్రం జారీ నేలపై పడవచ్చు. సుబ్రతా రాయ్ జీవితం మనకు నేర్పిస్తున్న సత్యం. రాయ్ సక్సెస్, ఫెయిల్యూర్ స్టోరీలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి. By Bhoomi 15 Nov 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు చూడాలో అన్ని ఒడిదుడుకులు చూశాడు. బండ్లు ఓడలు.. ఓడలు బళ్ళు అవ్వడం మనం చూసే ఉంటాం. ఆ కోవా కి చెందిన వారిలో సుబ్రతా రాయ్ ఒకరు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల మధ్య తళతళామంటూ మెరిసిన ఆయన తీహార్ జైలు గోడల మధ్య గడపాల్సి వచ్చింది. ఒక మనిషి ఎన్ని ఉత్థాన పతనాలను చవిచూడాలో సుబ్రతా రాయ్ అన్ని చూశారు. చెడి బతకవచ్చు..బతికి చెడలేము అనే సామతకు నిలువెత్తు ఉదాహరణగా రాయ్ జీవితం మనకు కనిపిస్తుంది. అలాంటి రాయ్ జీవితం చివరకు విషాదాంతంగా ముగిసింది. సహారా గ్రూప్ వ్యవస్థాపకుడుగా పేరొందిన సుబ్రతా రాయ్ నవంబర్ 14, 2023న మరణించారు. 75 ఏళ్ల వయసులో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారని సహారా గ్రూప్ తెలిపింది. భారతీయ వ్యాపారవేత్తల ప్రపంచంలో సుబ్రతా రాయ్ కు చాలా మంచి పేరు ఉంది. కేవలం 2000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత ఆయనకే చెల్లింది. చేతక్ స్కూటర్ టు చార్టెడ్ ఫ్లైట్: సుబ్రతా రాయ్ జూన్ 10, 1948న బీహార్‌లోని అరారియా జిల్లాలో జన్మించారు. సుబ్రతా రాయ్ కేవలం రూ. 2000 రూపాయలతో 1973లో నమ్‌కీన్ తినుబండారాలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతను వీధుల్లో స్కూటర్‌పై నమ్‌కీన్‌ను అమ్మేవాడు. ఈ రూ.2 వేల వ్యాపారంతో రూ.2 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు. సహరాశ్రీ అని ఆయన సన్నిహితులు ముద్దుగా పిలిచేవారు. గోరఖ్‌పూర్‌లోని బెట్టియాహటాలో ఒక న్యాయవాది ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆయను పిల్లలు కూడా అక్కడే పుట్టారు. సహారా గ్రూప్ వ్యాపారం ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, D2C. FMCG, హాస్పిటాలిటీతో సహా ఇతర రంగాలకు విస్తరించింది. 1978లో 'సహారన్ ఇండియా పరివార్' గ్రూపు స్థాపన: 1978లో 'సహారన్ ఇండియా పరివార్' గ్రూపును ప్రారంభించారు. అదే ఏడాది తన స్నేహితుడితో కలిసి గోరఖ్‌పూర్‌లో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. అదే సమయంలో సుబ్రతా రాయ్ స్కూటర్‌పై నమ్‌కీన్ వంటి ఆహార పదార్థాలను విక్రయించే వారు. తానే స్వయంగా దుకాణాలకు వెళ్లి సరుకులు పంపిణీ చేయడంతోపాటు స్మాల్ సేవింగ్స్‌పై దుకాణదారులకు అవగాహన కల్పించేవారు. అంతేకాదు స్మాల్ ఫైనాన్స్ వ్యాపారం కూడా చేసేవారు. సుబ్రతా రాయ్ 1990లలో మీడియా రంగంలోకి ప్రవేశించి: సుబ్రతా రాయ్ 1990వ దశకం నాటికి అనేక వ్యాపారాలకు విస్తరించారు. 1990వ దశకంలో అతను పూణే సమీపంలో ప్రతిష్టాత్మకమైన అంబీ వ్యాలీ సిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన హిందీ భాషా వార్తాపత్రిక రాష్ట్రీయ సహారాను 1992లో ప్రారంభించారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. సహారా వన్ పేరుతో పలు చానెళ్లను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో సహారా గ్రూప్ లండన్‌లోని గ్రోస్వెనర్ హౌస్ హోటల్, న్యూయార్క్ నగరంలోని ప్లాజా హోటల్ వంటి ప్రతిష్టాత్మకమైన ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. వివాదాలతో పతనం: వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుబ్రతా రాయ్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2014లో ఆయన అరెస్టుతో ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది . 2014లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో వివాదం కారణంగా రాయ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SHICL) 2011లో పెట్టుబడిదారుల నుండి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇవ్వాలని SEBI ఆదేశించింది. సహారా గ్రూప్ సెబీ వద్ద రూ.24,000 కోట్లు డిపాజిట్ చేయాల్సి వచ్చింది. కానీ నిధులను తిరిగి చెల్లించడంలో వైఫల్యం కారణంగా, సుబ్రతా రాయ్ ఢిల్లీలోని తీహార్ జైలులో దాదాపు 2 సంవత్సరాలు గడపవలసి వచ్చింది. 2017లో పెరోల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా సుబ్రతా రాయ్ డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తానని మాటిచ్చారు. అందుకు తగ్గట్టుగానే డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించేందుకు పోర్టల్ ను సైతం ప్రారంభించారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే. రాయ్ తనువు చాలించారు. రాయ్ జీవితం నేర్పిస్తున్న సత్యం: ఒక వ్యక్తి సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయిలో ఎదిగి దేశంలోనే టాప్ టెన్ మిలియనీయర్లలతో ఒకరిగాగా నిలిచి చివరకు తీహార్ జైలు గోడల మధ్య కూడా నలిగి, ఇప్పుడు తనపై పడ్డ మరకలను తుడుచుకునే ప్రయత్నంలో తనువు చాలించాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ రాయ్ జీవితం ఎలా బతకాలి? ఎలా బతకకూడదు? అనే రెండు పాఠాలను మనకు నేర్పిస్తుంది. కొత్తగా వ్యాపారంలో చేరే వారికి రాయ్ జీవితం ఒక గుణపాఠం. ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. కానీ నేల మీద మాత్రం మన మూలాలను కోల్పోకూడదు. ఒకవేళ ఆ మూలాలు బలహీనంగా ఉంటే మాత్రం జారీ నేలపై పడవచ్చు. ఇదే మనకు రాయ్ జీవితం నేర్పిస్తున్న సత్యం. ఇది కూడా చదవండి : నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. అధిష్టానం ఆ హామీ ఇచ్చిందని ప్రకటన! #gorakhpur #subrata-roy #subrata-roy-biopic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి