India vs Bharat: ఇండియా వర్సెస్ భారత్ చరిత్ర ఏంటి? రాజ్యాంగం ఏం చెబుతోంది?

'ఇండియా' పేరును పూర్తిగా తొలగించి కేవలం 'భారత్' అనే పేరునే అధికారికంగా ఉపయోగించాలని కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. జీ20సమావేశాల విందు పిలుపులో 'ప్రెసిడెంట్‌ ఆఫ్ ఇండియా'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్‌ భారత్‌' అని ప్రింట్ చేయడం రచ్చకు దారి తీసింది. దీంతో అసలు ఈ 'ఇండియా', 'భారత్‌' అనే పేర్లు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై నెటిజన్లు గూగుల్‌లో తెగ సేర్చ్ చేస్తున్నారు.

India vs Bharat: ఇండియా వర్సెస్ భారత్ చరిత్ర ఏంటి? రాజ్యాంగం ఏం చెబుతోంది?
New Update

Explainer: India, Bharat names history: "జనగణమన అధినాయక జయహే.. 'భారత' భాగ్యవిధాతా" తో మొదలయ్యే జాతీయ గీతం 'జై హింద్‌'తో ముగుస్తుంది. అంటే జాతీయ గీతంలో భారత్‌ అనే పదంతో పాటు పరోక్షంగా 'హింద్‌' అనే పదం కూడా ఉంది. సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.. ఎక్కువ భాగం సింధూ నది పాక్‌లోనే ఉంది. ఈ 'సింధ్‌' నుంచే హింద్‌, హిందుస్థాన్‌.. ఇండియా పదాలు వచ్చాయి. 400 BCEలో మెగస్తనీస్ 'ఇండికా'ని ఉపయోగించారు. 18వ శతాబ్దం నాటికి బ్రిటీష్‌ వాళ్లు ఎక్కువగా ఇండియా అనే పేరును మ్యాప్స్‌లో తీసుకొచ్చి పెట్టారు. ఇక మన దేశానికి మరో పేరైన 'భారత్‌' సంస్కృతం నుంచి తీసుకున్న పదం. పురాణ రాజు భరతుడితో ఈ పేరు ముడిపడి ఉందని చెబుతారు.. మరికొందరు ఈ పేరు వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయంటారు. ప్రస్తుతం 'ఇండియా' అనే పేరును తొలిగించి కేవలం 'భారత్‌' అనే పేరునే వాడాలని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. దేశం పేరు మార్పుకు సంబంధించి రానున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం బిల్లును కూడా ప్రవేశపెట్టనుందన్న ప్రచారం జరుగుతోంది.

publive-image రాజ్యాంగంలో ఇండియా అనే పేరుతో పాటు భారత్‌ అనే పేరు కూడా ఉంది

'భారత్‌' అనే పేరు ఎక్కడ నుంచి వచ్చిందంటే:
'భారత్‌, భారతా, భారత్‌వర్షా' ఈ పదాల మూలాలు పురాణ సాహిత్యం, ఇతిహాసమైన మహాభారతం నుంచి తీసుకున్నట్టు చెబుతారు. పురాణాలు భారత్‌ని 'దక్షిణాన సముద్రం, ఉత్తరాన మంచు నివాసం' మధ్య ఉన్న భూమిగా వర్ణిస్తాయి. భారతీయులు భరత్ రాజు వారసులమని నమ్ముతారు. చాలా మంది చరిత్రకారులు ఇది హిందూ గ్రంథాల నుంచి వచ్చిన పదం అని చెబుతారు. ఇక చరిత్రలో చాలా మంది భరతులు ఉన్నారు. శ్రీరాముడి తమ్ముడు పేరు కూడా భరతుడే.. రుషభదేవుని కుమారుడు, శకుంతలా-దుష్యంతుల తనయుడు పేరు కూడా భరతుడే. వీటిలో ఎవరి వల్ల 'భారత్‌' అనే పేరు వచ్చిందో స్పష్టమైన క్లారిటీ లేదు. ఇక 1927 జనవరిలో జవహర్‌లాల్ నెహ్రూ సైతం భారత్‌దేశం అనే పదాన్ని ఉపయోగించారు. 'భారతదేశం, హిందువుల పవిత్ర భూమి, హిందూ తీర్థయాత్ర గొప్ప ప్రదేశాలు 'భారత'దేశంలోని నాలుగు మూలల్లో ఉన్నాయన్నారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ 'ట్రస్ట్ విత్‌ ఇండియాస్ డెస్టిని' స్పీచ్‌లో ఇండియా అనే పేరునే యూజ్‌ చేశారు.

publive-image జీ20 సమావేశాల విందు ఆహ్వానం

ఇండియా పదం ఎక్కడ నుంచి వచ్చింది?
"ఇండియా" అనే పదం బీసీ కాలం నుంచే వ్యాప్తిలో ఉన్నా ఈ పేరు విశ్వవ్యాప్తం అవ్వడానికి బ్రిటీష్‌ పాలకులే కారణం. 17వ శతాబ్దం నాటికి మోడ్రెన్‌ ఇంగ్లీష్‌లో ఈ పదం పునరుజ్జీవం పొందింది. సింధ్ నది నుంచి మన దేశానికి ఈ పేరు వచ్చింది . సింధు లోయ ప్రాంతం ప్రపంచంలోని తొలి నాగరికతలలో ఒకటి. సింధు లోయ నాగరికత సుమారు 3,300BCEలో ప్రారంభమైంది. భారతీయ నాగరికత సింధు నదికి సమీపంలో ప్రారంభమైంది కాబట్టి, మన దేశానికి 'ఇండియా' అని పేరు వచ్చింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మాసిడోనియన్ రాజు అలెగ్జాండర్ మనదేశంపై దండెత్తే సమయానికి సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతాన్ని కూడా ఇండియా అనే పిలుస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం పాలనలో కూడా మన దేశాన్ని 'హిందూస్థాన్' అనే పిలిచేవారు. అయితే బ్రిటిష్ వలసవాదులు స్వాధీనం చేసుకున్న తరువాత.. హిందూస్థాన్ క్రమంగా ఇండియాగా ప్రాచుర్యం పొందింది.

రాజ్యాంగంలో ఏం ఉంది?
రాజ్యాంగంలో ఇండియా అనే పేరుతో పాటు భారత్‌ అనే పేరు కూడా ఉంది. ఆర్టికల్-1లో ఈ రెండు పేర్లు కనిపిస్తాయి. 'India, that is Bharat, shall be a Union of States' అని ఉంటుంది. అంటే 'ఇండియా.. భారత్‌ అని కూడా పిలిచే ఈ దేశం రాష్ట్రాల సమూహారం అని ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం 'ఇండియా' అని పేరును తొలగించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు భారత్‌ అనే పేరునే ఉపయోగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

publive-image 2004 ఆగస్టు 3న ములాయం సింగ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు

ఈ డిమాండ్‌ బీజేపీ నేతలది కాదు:
నిజానికి ఈ పేరు మార్పు వ్యవహారాన్ని హైలెట్ చేసింది సమాజ్‌వాదీ పార్టీ. 2004 ఎన్నికల్లో సమయంలో ఇండియాను భారత్‌గా మార్చాలని ములాయం సింగ్ ప్రతిపాదించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2004 ఆగస్టు 3న ములాయం సింగ్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును సమర్పించారు. సభలో ప్రవేశపెట్టిన తర్వాత, దేశం పేరు మార్చే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ ములాయం సింగ్ ఎప్పుడూ ఒకే దేశం, ఒకే పేరుకు అనుకూలంగా ఉన్నారన్నారు. తాజాగా బీజేపీ నేతలు కూడా మూలయం సింగ్‌ని ఓన్‌ చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు భారత్‌ అనే పేరును మొదటి నుంచి వ్యతిరేకించే తమిళులు.. ఎప్పటిలాగే ఇండియా పేరుకు మద్దతిస్తున్నారు. ద్రవిడ ఉద్యమాల సమయంలోనూ ఇండియా అనే పేరునే తమిళులు ఉపయోగించారు.

పేరు మార్పుతో లాభం ఎవరికి?
రాజకీయ పార్టీలు ఏం చేసినా స్వలాభం కోసమే. అది బీజేపీ కావొచ్చు.. కాంగ్రెస్‌ కావొచ్చు.. ఇది ఔనన్నా కాదన్నా అంగీకరించాల్సిన నిజం. ఓవైపు దేశంలో ధరలు పెరుగుదల, నిరుద్యోగం లాంటి సమస్యలు పెరిగిపోతున్న సమయంలో ఈ పేరు మార్పు డిమాండ్ తెరపైకి వచ్చింది. అటు ప్రతిపక్షాలు సైతం ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీ ఈ తరహా ప్రచారం చేయడం వెనుక చాలా కథ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇండియా పేరును తొలిగించడం వల్ల హిందువులు ఎక్కువగా ఉండే రాష్ట్రాలపై తమకి పట్టు దొరుకుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారట. వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఈ లోపే ఇండియా పేరు తొలగించి హిందీ, హిందూ హార్ట్‌ల్యాండ్‌పై గెలవాలని ఎన్డీయే ప్రణాళికలు చేస్తున్నదన్నది విశ్లేషకుల మాట.

ALSO READ: అజెండా ఏంటో తెలపాలి..మోడీకి సోనియా లేఖ!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి