ఎన్నికల వేళ ఏపీలో సరికొత్త వివాదం నడుస్తోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే.. ఈ యాక్ట్ ఏంటి? అందులో ఏముంది? వివాదం ఎందుకు జరుగుతోంది? అన్న పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ ను జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రపేశపెట్టింది. బిల్లుకు ఆమోదం లభించడంతో దానికి కేంద్రానికి పంపించింది ప్రభుత్వం. వివిధ మార్పుల తర్వాత గతేడాది ఈ యాక్ట్ కు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. టెక్నికల్ గా 2023 అక్టోబరు 31 నుంచే అమల్లోకి చట్టం వచ్చింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఎన్నో అనుమానాలు
ఈ చట్టంతో భూ సమస్యలు తీరుతాయా? లేక భూములు కోల్పోవాల్సి వస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తాయో ఏపీలోనూ అలాగే అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఏంటీ చట్టం..?
కొత్త చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో మీ పేరు చేరి, మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అదే తిరుగులేని ఆయుధం అవుతుంది. ఇక ఎవరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా.. ప్రభుత్వమే గ్యారెంటీగా నష్ట పరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారెంటీ అని అన్నారు.
దావాలు వేయడం కుదరదు..
-- కొత్త చట్టం ప్రకారం మీ భూ సమస్యపై సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం కుదరదు
-- టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు..
-- ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే తీరుస్తారు
-- ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి
-- వీళ్లద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్లాలి.
అనుకూల వాదనలు..
--ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల చుట్టూ ఉన్న చాలా గొడవలకు పరిష్కారం
--కోర్టులపై భారం తగ్గుతుంది
--నకిలీ పత్రాలతో భూమి కబ్జాలు చేసే అవకాశం ఉండదు
అనుమానాలు..
-- కోర్టులకు బదులుగా అధికారులే భూ వివాదాలు పరిష్కరిస్తారు.
-- ఈ అధికారులు స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు
-- అంటే ప్రభుత్వం తల్చుకుంటే ఎవరినైనా టార్గెట్ చేయవచ్చు..
-- మీ భూమికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి నేరుగా మీ భూమి విషయంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద ఫిర్యాదు చేస్తే సదరు అధికారి విచారించి నిర్ణయం ప్రకటిస్తారు.
-- ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుంది.. ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్
-- ఇతరులు ఫిర్యాదు చేస్తేనే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేపట్టాలని లేదు..
-- ఆ అధికారి సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు.
-- టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా కేసు పెట్టకుండా చట్టంలో రక్షణ
-- తప్పుడు పత్రాలు ఇచ్చారనే సాకుతో.. 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఉంటుంది.
-- ఒక వేళ మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీర్పు నచ్చక.. హైకోర్టు, లేదా సుప్రీంకు వెళ్లి గెలిస్తే... 15 రోజుల్లోపు సదరు అధికారికి ఆ విషయాన్ని తెలియచేయాలి. లేదంటే సుప్రీం కోర్టు తీర్పు కూడా చెల్లకుండా పోతుంది
-- హైకోర్టు వరకు వెళ్లి.. న్యాయపోరాటం చేయలేని వారి పరిస్థితి ఏంటి? అన్నది ఓ ప్రశ్న.
-- భూ యజమాని చనిపోతే వారి వారసులు ఎవరు అనేది నిర్ణయించే బాధ్యత అధికారిదే.. కావడం కూడా వివాదానికి మరో కారణంగా చెప్పొచ్చు.