/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jupally222-jpg.webp)
నాలుగు ముహుర్తాల తర్వాత ఐదో ముహుర్తంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(jupally krishna rao) అధికారికంగా కాంగ్రెస్(congress) కండువా కప్పుకొనున్నారు. ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(mallikharjuna kharge) సమక్షంలో హస్తం పార్టీలోకి వెళ్లనున్నారు. నిజానికి ఈరోజు జరగాల్సి ఉన్న కొల్లాపూర్(kollapur) సభలో జూపల్లి లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ప్రియాంక గాంధీ సమక్షంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ గూటికి చేరాలని భావించినా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల సభకు అనూకులంగా లేవని సమాచారం. అందుకే పలుమార్లు కొల్లాపూర్ సభ వాయిదా పడినట్టుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
జూపల్లితో పాటు మరికొందరు:
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ అసంతృప్తులు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీవర్ధన్ తదితరులు ఇవాళ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఖర్గేతో ముందుగా భేటీ అయిన తర్వాత అధికారికంగా పార్టీలోకి వీరందరని కాంగ్రెస్ ఆహ్వానించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు జూపల్లి పార్టీలో చేరుతారని సమాచారం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంకాగాంధీలో ఒకరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ నేతల చురకలు:
కొల్లాపూర్ సభ పలుమార్లు వాయిదా పడుతూ రావడం.. జూపల్లి చేరికపై రెండు నెలలగా గందరగోళం నెలకొని ఉండడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్‌మీడియాలో ఈ మాజీ మంత్రికి చురకలంటిస్తున్నారు. జూపల్లికి అంత సీన్ లేదని.. అందుకే కొల్లాపూర్ సభకు వచ్చేందుకు ప్రియాంకకు తీరక దొరకడం లేదంటూ వ్యంగ్యంగా ప్రచారం చేస్తున్నారు. అయితే నిజానికి గత నెలలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలోనే పొంగులేటి కాంగ్రెస్‌లోకి చేరినప్పుడే జూపల్లి కూడా చేరుతారని ప్రచారం జరిగింది. కానీ జూపల్లి మాత్రం కొల్లాపూర్ సభపై ఆశలు పెట్టుకున్నారు. ముందుగా జులై 20.. ఆ తర్వాత జులై 25.. ఆ తర్వాత జులై 30.. ఆ తర్వాత ఆగస్టు 2..ఇక ఆగస్టు 6 అని కూడా అనుకున్నారు కానీ.. తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండడంతో బహిరంగ సభకు ఛాన్స్ లేకుండా పోయిందని జూపల్లి అనుచరులు చెబుతున్నారు. వరదల కారణంగా సభ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండడంతో అటు బీఆర్‌ఎస్ కార్యకర్తల సోషల్‌మీడియా ప్రచారం పెరిగిపోయిందని.. దానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే కాంగ్రెస్ పెద్దలు జూపల్లిని ఢిల్లీ పిలిపించుకున్నారని హస్తం సపోర్టర్స్ చెబుతున్నారు. చేరిక తర్వాత వీలు చూసుకోని జూపల్లి కొల్లాపూర్ సభకు ప్లాన్ చేస్తారన్నది కాంగ్రెస్ కార్యకర్తల మాట.