మణిపూర్ ఎఫెక్ట్...ఈ శాన్యంలోని ఇతర రాష్ట్రాలపైనా చూపుతోంది. ముఖ్యంగా తాజా అల్లర్లు..మణిపూర్‌లో మహిళలపై అకృత్యం ఘటనలు వెలుగులోకి రావడంతో...ఇతర ఈశాన్యరాష్ట్రాలు భయం గుప్పిట్లోకి వెళ్తున్నాయి. నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న మిటీల్లో..ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. గిరిజన తెగలైన కుకీలు, తమపై దాడులకు పాల్పడుతారన్న భయంతో మిటీలు ఇప్పుడు తమ స్వంత రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మిజో నేషనల్ పార్టీ (MNF), పీస్ అకార్డ్ ఎంఎన్ఎఫ్ రిటర్నీస్ అసోసియేషన్ (PAMRA)మాజీ సాయుధ విభాగం..మిజోరంలో నివసిస్తున్న మిటీలు తమ స్వంత భద్రత కోసం మిజోరంను విడిచి వెళ్లాల్సిందిగా కోరింది. మిటీలు వ్యవహారించిన తీరు మిజో సమాజంలో తీవ్ర అసంత్రుప్తిని కలిగించిందని PAMRA పేర్కొంది.
మణిపూర్ లోని ఉద్రిక్త పరిస్థితులను హైలైట్ చేస్తూ ఈ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మణిపూర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని...మణిపూర్‌లో దుండగులు చేసిన అనాగరిక, హేయమైన చర్యల నేపథ్యంలో మణిపూర్ మిటీ వర్గానికి చెందిన ప్రజలు ఇక్కడ నివసించడం సురక్షితం కాదని తెలిపింది.
మిటీలకు వ్యతిరేకంగా ఏదైనా హింస జరిగినట్లయితే...దానికి వారే బాధ్యత వహించాలని PAMRA పేర్కొంది. మిటీలపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మేం తమ రాష్ట్రానికి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పిటిఐను ఉటంకిస్తూ PAMRA సెక్రటరీ జనరల్ సి లాల్థెన్ లోవా అన్నారు.
కాగా మిజోరంలో 60మంది మిటీలు శనివారం రాష్ట్రాన్ని వదిలి విమానాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. మే 4న మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలను ఒక దుండగుల గుంపు నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయన్న భయంతో...60మంది మిటీ ప్రజలు మిజోరంలోని ఐజ్వాల్ నుంచి విమానంలో తరలివెళ్లిపోయారు. చాలా మంది బస్సు,ట్యాక్సీల్లోనూ అస్సాంకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మిగతావారిలోనూ భయం నెలకొంది.
PAMRA అనేది భారత యూనియన్ నుంచి రాష్ట్ర విభజన కోసం పోరాడుతున్న మాజీ మిలిటెంట్ గ్రూప్. 1986లో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత తమ ఆయుధాలను విడిచిపెట్టింది. చివరికి దాని సభ్యుల ప్రయోజనం కోసం శాంతి ఒప్పందం ఎంఎన్ఎఫ్ రిటర్నీస్ అసోసియేషన్ PAMRA రూపొందించింది.