టీఎస్ఆర్టీసీ బిల్ విషయంలో మరోసారి సర్కార్ వర్సెస్ గవర్నర్ నడుస్తున్న వార్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తమిళి సై వెనుక ఎవరు ఉన్నారో మన అందరికి తెలుసన్నారు. మల్లా రెడ్డి అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టారని ఆమె ప్రశంసించారు.
కానీ బిల్లును ఆమోదించాల్సిన గవర్నర్ మాత్రం ఆమోదం తెలపడం లేదన్నారు. మేడ్చల్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కవిత. ప్రొఫెసర్ జయశంకర్ తమ కుటుంబ సభ్యుడిలా ఉండేవారని.. ఆయన నుంచి అనేక అంశాలు నేర్చుకున్నామని తెలిపారు.
కాగా, ఆర్టీసీ బిల్లు విషయంలో తాను వ్యతిరేకం కాదని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని, శ్రేయస్సునే కోరుకుంటున్నానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిన డ్రాఫ్టు బిల్లులో కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని..ప్రభుత్వం నుంచి రెండు దఫాలుగా క్లారిటీ వచ్చిందన్నారు. అయినా కాని కొన్ని నివృత్తి కావాల్సిన అవసరం ఉందనడంతో మరోసారి ఈ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడిన ఆమె అధికారులతో చర్చలు జరిగిన తరువాత తనకు వచ్చే స్పష్టతకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటానని అన్నారు.