అస్సాం(Assam)లో గజరాజుల మరణాలు ఆగడంలేదు.. ప్రతి ఏడాది అక్కడ ఏనుగుల(Elephants) సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. తాజాగా మరో రెండు ఏనుగులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నాగోవ్ జిల్లాలో ఉన్న ఓ పర్వతం కింద రెండు ఏనుగులు చనిపోయి కనిపించాయి. అందులో ఒక ఆడ ఏనుగు కూడా ఉంది. ఏనుగుల మృతదేహాలను గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది.. గజేంద్రుల మరణాలపై దర్యాప్తు ప్రారంభించారు. నాగావ్(Nagaon) జిల్లాలో ఏనుగులు మృతి చెందడం ఇదే మొదటిసారి కాదు. మే 2021లో, పిడుగుపాటు వల్ల ప్రమాదవశాత్తూ 18 ఏనుగులు మరణించాయి. ఏనుగుల మరణాల విషయంలో అస్సాం నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అసలు ప్రతి ఏడాది అక్కడ పదుల సంఖ్యలో ఏనుగులు ఎందుకు చనిపోతున్నాయి...?
ఏనుగుల మరణాలకు ప్రధాన కారణాలు:
1) విద్యుదాఘాతం(electrocution)
2) విషప్రయోగం(poisoning)
3) రైలు ఢీకొని చనిపోవడం(Train hit)
ఎందుకిలా జరుగుతోంది?
అస్సాం ఏనుగుల మృతికి ప్రధాన కారణాల్లో మూడోది రైలు ప్రమాదం మినహాయిస్తే మిగిలిన రెండు మనుషులు ప్లాన్ ప్రకారం చేసినవే.! విద్యుదాఘాతం, విషప్రయోగం ఏనుగులను చంపడానికి కొందరు కావాలనే చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పిడుగుపాటుతో ఏనుగుల మరణాలకు ఎవరూ బాధ్యత కాకున్నా.. కరెంట్ వైర్లు తగిలి ఏనుగులు ఎక్కువగా చనిపోతుండడం కలవర పెడుతోంది. ప్రతిఏటా 70-80 ఏనుగులు హ్యుమన్-యానిమల్(human-animal) కాన్‌ఫ్లిక్ట్ కారణంగానే మరణిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవారీ(Chandra Mohan Patowary) ఈ ఏడాది మార్చిలో చెప్పిన లెక్కలు చూస్తే ఈ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.
లెక్క ఎందుకు తగ్గుతోంది?
ఏనుగుల సహజ ఆవాసాలను మానవులు ఆక్రమించడం వల్ల జంతువులు ఆహారం కోసం పొలాల్లోకి మనుషులు తిరిగే ఇతర ప్రాంతాల్లోకి వస్తున్నాయి. దీని కారణంగానే వాటి అడ్డు తొలగించుకునేందుకు విషప్రయోగానికి కూడా వెనకాడడం లేదు మనిషి. ప్రస్తుతం అస్సాంలో ఏనుగుల సంఖ్య 5,500కు పైగా ఉంది. 2001 నుంచి 2022 మధ్య 1,330 ఏనుగులు చనిపోగా.. 2013లో అత్యధికంగా 107, 2016లో 97, 2014లో 92 ఏనుగులు మరణించాయన్నది ప్రభుత్వ లెక్క.! మరణాలకు వివిధ కారణాలలో 509 ఏనుగులవి సహజ మరణాలే. అయితే 261 ఏనుగులు ఏ కారణంతో చనిపోయాయో ప్రభుత్వానికి తెలియదు. 202 ఏనుగులు విద్యుదాఘాతంతో, రైలు ప్రమాదాల్లో 102 ఏనుగులు, విషజ్వరాలతో 65 ఏనుగులు, ఇక వేటగాళ్లు 40 ఏనుగులని చంపడం, పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి చెందాయి.
మనిషి ఎందుకిలా చేస్తున్నాడు?
నిజానికి జంతువులు ఉండే ప్రాంతాలను మనిషి ఎప్పుడో ఆక్రమించేసుకున్నాడు. అడవులను నరికివేస్తున్నాడు. అస్సాంలోనూ అదే జరిగింది. ఏనుగులు తిరిగిన ప్రాంతాలు ఎప్పుడో ఆక్రమణకు గురయ్యాయి. దిక్కుతోచని స్థితిలో.. ఏం తినాలో అర్థంకాని ఏనుగులు ఊర్లమీదకు వస్తున్నాయి. ఇక ఆహారం కోసం వెతుకుతూ అడవుల వెలుపల సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో గ్రామస్థులు విద్యుత్తు తీగలను ఉపయోగించి వాటి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కరెంట్ వైర్లు తగిలి ఏనుగులు చనిపోతున్నాయి. మరికొందరు విషప్రయోగం చేసి ఏనుగులను చంపేస్తున్నారని స్వచ్ఛంద సంస్థల చెబుతున్నాయి.