Pithapuram Varma: పిఠాపురం వర్మ.. కష్టానికి గుర్తింపు దక్కుతుందా? ఫలితాల పవన్ ఏమి చేస్తారు? 

అన్నిటిదీ ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది మరో లెక్క. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో పీటముడులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పిఠాపురం వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ పోటీకి దారిచ్చారు. మరి భవిష్యత్ లో ఆయన త్యాగానికి గుర్తింపు ఉంటుందా? ఈ విశ్లేషణ  చూడండి.. 

New Update
Pithapuram Varma: పిఠాపురం వర్మ.. కష్టానికి గుర్తింపు దక్కుతుందా? ఫలితాల పవన్ ఏమి చేస్తారు? 

Pithapuram Varma: ఎన్నికలు అయిపోయాయి. ఓట్ల సునామీ ఈవీఎంలలో ప్రశాంతంగా ఉంది. ఎన్నికల ఫలితాల తుపాను ముందు కొట్లాటల ఈదురుగాలులు గట్టిగానే వచ్చాయి. ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత అనే బెట్టింగుల హోరు తప్ప ప్రస్తుతం తుపాను ముందరి ప్రశాంతతలా పరిస్థితి ఉంది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు మొదలైన ఆ నియోజకవర్గ ఓటర్ల జోరు.. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ కొనసాగేలానే ఉంది. ఆ నియోజకవర్గం పిఠాపురం. ప్రతి ఎన్నికల ముందు.. ఈ నియోజకవర్గం కాస్త భిన్నంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ, ఈసారి దేశమంతా మారుమోగేలా ఈ నియోజకవర్గ ఎన్నికల హంగామా ఉంది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీలో ఉండడమే. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నామినేషన్.. ప్రచారం.. ఓటింగ్ సరళి.. అన్నిటిలోనూ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నది.. నడిపించింది మరో శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఎస్వీఎస్ఎన్  వర్మ. ఆయనను పవన్ వెనుక ఉన్న శక్తి అనడం విషయంలో ఎవరికీ అభ్యంతరాలు కచ్చితంగా ఉండవు. ఎందుకంటే.. అదే వాస్తవం కనుక. ఈ సత్యనారాయణ వర్మ పిఠాపురం రాజకీయాల్లో సంచలనమైన వ్యక్తి. ఎందుకో ముందు చూద్దాం.. 

Also Read: అప్పుడు తమరు దేవుడు.. ఇప్పుడు మీరెవరు? ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ ధోరణి!

తెలుగుదేశంలో రెబల్ లీడర్..
Pithapuram Varma: పిఠాపురం వర్మగానే రాజకీయాల్లో అందరికీ దగ్గరవాడైన వర్మ తెలుగుదేశం పార్టీలో ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరిలోనూ బలమైన నాయకుడని చెప్పాలి. ఎందుకంటే, పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. అక్కడ నుంచి విజయం సాధించి.. తిరిగి టీడీపీ కండువా సగర్వంగా కప్పుకున్న వ్యక్తి. ఇంత జరిగినా.. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి పూర్తి విధేయుడిగానే నిలిచిన నాయకుడు ఆయన. పిఠాపురం నియోజకవర్గంలో సీటు ఎవరికి అనే అనుమానం తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ రాదు. అది వర్మ కోసమే అనేంతగా పిఠాపురం టీడీపీలో ఆయన ముద్ర ఉంది. అలంటి నాయకుడు ఈసారి పోటీనుంచి పక్కకు జరిగి.. పవన్ కళ్యాణ్ కి దారి ఇవ్వడమే కాకుండా.. ఆయన విజయం కోసం చెమటోడ్చారు. 

ఇద్దరూ త్యాగాల వీరులే..
Pithapuram Varma: రాజకీయాల్లో స్వార్ధం.. కుర్చీ కోసం పోరాటం ఉంటాయి. ఉండాలి కూడా. అధికారం కోసం కాకపొతే ఎవరు రాజకీయాల్లోకి వస్తారు చెప్పండి. కానీ, పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి సీటు విషయంలో పీటముడి పడింది. ఒక పక్క జనసేన అధ్యక్షుడిగా. టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ సీటు కోరుకున్నారు. మరోపక్క తన పార్టీ పోటీ చేసే సీట్ల విషయంలో పూర్తిగా తగ్గి వ్యవహరించారు. ముందుగా అనుకున్న 23 సీట్లలో రెండు సీట్లను పొత్తు ధర్మంగా బీజేపీకి వదిలేశారు పవన్ కళ్యాణ్. తన మీద జనసైనికుల ఒత్తిడి ఎంత ఉన్నా.. తనను ఎన్ని రకాలుగా వైసీపీ నాయకులూ తూలనాడినా.. అన్నిటినీ భరించి.. 21 సీట్లలో పోటీకి సిద్ధం అయిపోయారు. అటువంటి వ్యక్తి పిఠాపురం కోరుకున్నారు. మరోపక్క ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామం.. ప్రతి ఓటరును కలిసి.. టీడీపీ విజయం కోసం ప్రత్యేకంగా ఒక వ్యూహం సిద్ధం చేసుకుని పోటీకి రెడీ అయిపోయారు వర్మ. సరిగ్గా ఇక్కడే.. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని.. వర్మకు నచ్చ చెప్పారు. దీంతో.. ఆయన పార్టీ కోసం.. కూటమి గెలుపు కోసం పవన్ వెనుక నిలిచారు. 

నెక్స్ట్ ఏమిటీ..
Pithapuram Varma: ఎన్నికలు అయిపోయాయి. అంచనాలు పవన్ గెలుపు పక్కా అంటున్నాయి. మరి ఇప్పుడు వర్మ ఏమి చేస్తారు? ఏమి చేయాలి? ఇది తాజాగా అక్కడి రాజకీయ విశ్లేషకుల్లో తలెత్తుతున్న ప్రశ్న. దీనికి సమాధానం కూడా చూచాయగా వర్మ తేల్చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ గెలుపు పక్కా.. నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం ఎలా అయితే, కష్టపడ్డామో.. రేపు పవన్ గెలిచిన తరువాత ఆయన ఏమి చెబితే అదే చేస్తాను అంటూ స్పష్టం చేశారు. పవన్ కూడా ప్రచారంలోనూ.. ఎన్నికల తరువాత ప్రత్యేకంగా వర్మకు కృతజ్ఞతలు చెబుతూ రాసిన బహిరంగ లేఖలోనూ ఆయనను చట్టసభల్లో చూస్తామని చెప్పారు. అంటే.. ఎమ్మెల్సీగా పిఠాపురం వర్మను ఎంపిక చేయడం గ్యారెంటీ అని అర్ధం అయిపోతోంది. 

పవన్ మంత్రి కావడం ఖాయం.. మరి వర్మ..?
Pithapuram Varma: పవన్ గెలిస్తే.. కూటమి తరపున మంత్రి కావడం ఖాయం అని తెలుస్తోంది. మరి వర్మకు ఆ ఛాన్స్ ఉంటుందా? అంటే.. కష్టమనే చెప్పాలి. ఒకే చోట నుంచి రెండు మంత్రి పదవులు ఇవ్వడం అధికార లెక్కల్లో కుదరవు కదా. మరి వర్మకు దొరికే ప్రాధాన్యం ఏమిటి? ఆయన త్యాగానికి ఎమ్మెల్సీగా సరిపెట్టుకోవాల్సిందేనా? ఇదే ప్రశ్న పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలలో వినిపిస్తోంది. 

రెండో కోణం..
Pithapuram Varma: పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తేనే వర్మ ఎమ్మెల్సీ కాగలుగుతారు. ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోతే? అప్పుడు వర్మ పరిస్థితి ఏమిటి? పవన్ ఎమ్మెల్యేగా ఉన్న చోట.. రెండో స్థాయి నాయకుడిలా ఉండాల్సిందేనా? దానికి వర్మ సిద్ధం అవుతారా? అసలు ఆయన అలా ఉండగలరా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. అదీకాకుండా.. అన్నిటికంటే అతిపెద్ద విషయం.. ఇప్పుడు కూటమిగా పోటీ చేస్తున్నారు.. పవన్ కోసం సీటు వదిలేశారు. మరి వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ కూటమి పోటీ చేస్తే.. అప్పుడు పిఠాపురం సీటు వర్మకు ఇచ్చేస్తారా? ఆ గ్యారెంటీ ఏమైనా ఉందా? అది చాలా కష్టం అనే అనుకోవాలి. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.  

మొత్తంగా చూసుకుంటే.. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు తెచ్చాయో.. అంతకు రెట్టింపు చిక్కుముడులను పిఠాపురం నియోజకవర్గంలో తీసుకువచ్చాయి. ఇక్కడొక మాట వర్మ గురించి చెప్పుకోవాలి. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో తన సీటు వదులుకోవాల్సి వచ్చిన నాయకులు చరిత్రలో చాలామంది ఉన్నారు. కానీ, వారెవరూ కూడా తమ అధినాయకుడి ప్రతిష్ట కోసం నూరుశాతం ఆ నియోజకవర్గాల్లో నిలబడ్డ వారిని గెలిపించడానికి ప్రయత్నించలేదు. ఇది వాస్తవం. సరిగ్గా ఈ పాయింట్ ను వైసీపీ కూడా ఇక్కడ నమ్ముకుంది. వర్మ వైసీపీలోకి వచ్చేస్తున్నారనే గ్లోబల్స్ ప్రచారంతో ఒక దశలో సీరియస్ మైండ్ గేమ్ ఆడింది. అయినా కానీ.. ఇటు వర్మ.. అటు పవన్ తమ పని తాము చేసుకున్నారు. పవన్ మీద ఎక్కువ భారం లేకుండా అన్నీ తానై పిఠాపురం ప్రచారం నిర్వహించారు. రేపు పవన్ గెలిస్తే దానిలో సింహ భాగం వర్మ కృషి అనడంలో సందేహం లేదు. దీనిని గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ది అనడంలో సందేహం లేదు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు