Malkajgiri: మల్కాజ్ గిరి.. దేశంలోనే ప్రత్యేకమైన నియోజకవర్గం.. ఇక్కడి ఓటర్లూ విలక్షణమైన వారే.. 

దేశంలోనే అత్యంత ప్రత్యేకత కలిగిన పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్ గిరి. ఎక్కువ ఓటర్లు కలిగిన అతి పెద్ద నియోజకవర్గం ఇది. మినీ ఇండియాగా ఈ నియోజకవర్గం. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తారు. మల్కాజ్ గిరి నియోజకవర్గ స్పెషాలిటీ ఏమిటో ఆర్టికల్ లో చూడొచ్చు 

Malkajgiri: మల్కాజ్ గిరి.. దేశంలోనే ప్రత్యేకమైన నియోజకవర్గం.. ఇక్కడి ఓటర్లూ విలక్షణమైన వారే.. 
New Update

Malkajgiri: దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. హోమ్ మంత్రి అమిత్ షా పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలకూ లేని ప్రత్యేకత తెలంగాణలోని.. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి ఉంది. ఆ ఇద్దరు పోటీ చేసున్న  నియోజకవర్గాల ఓటర్లను కలిపినా మల్కాజ్ గిరి ఓటర్ల కంటే తక్కువే ఉంటారు. అవును.. ఓటర్ల లెక్కల పరంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం ఇది. ఇక్కడ మొత్తం ఓటర్లు 3.74 మిలియన్లు.  ఇందులో 1.93 మిలియన్ పురుషులు, 1.81 మిలియన్ మహిళా ఓటర్లు ఉన్నారు. అంతేకాదు మల్కాజ్ గిరిని మినీ ఇండియాగా కూడా చెప్పవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇంకా ఈ నియోజకవర్గ ప్రత్యేకతల్లో.. దేశంలోనే అతి పెద్ద కంటోన్మెంట్ ఏరియాలలో ఒకటైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ దీని పరిధిలోనే ఉంది. మొత్తం  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు - మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బి నగర్ - సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ముక్కోణపు పోటీ రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేదానిపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. పెద్దస్థాయిలో మల్కాజ్ గిరి గెలుపు ఓటములపై చర్చ జరుగుతోంది. అందుకే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరుతెన్నులపై ఓ లుక్కేద్దాం. 

Malkajgiri: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముక్కోణ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తరఫున ఆర్. లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నుంచి పి.సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో (2019లో) ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అంతకు కొన్ని నెలల ముందు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అటువంటి పరిస్థితిలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఎంతో పోటీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు దక్కించుకుని బీఆర్ఎస్ వేవ్ పూర్తిగా ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి సన్నిహితంగా మారారు. ఎంపీ కావడంతో రాహుల్ దగ్గర సాన్నిహిత్యం పెంచుకునే అవకాశం దక్కింది. దీంతో పాత కాపులు ఎందరు ఉన్నా.. కాదని.. రేవంత్ ను తెలంగాణ పీసీసీ చీఫ్ చేసి ప్రోత్సహించారు రాహుల్ గాంధీ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. కాంగ్రెస్ అధినాయకత్వ మద్దతుతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇదంతా గతం. ప్రస్తుతానికి వస్తే.. 

Modi road show at Malkajgiri

Also Read: పాకిస్తాన్ కి గౌరవం ఇవ్వకపోతే అణుబాంబు పడుతుంది

పోటీ చేస్తున్న ముగ్గురూ స్థానికేతరులు..
Malkajgiri: మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీదారులలో - కాంగ్రెస్‌కు చెందిన సునీతా మహేందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీకి చెందిన ఈటల రాజేందర్ -  BRS నుండి పోటీలో ఉన్న రాగిడి లక్ష్మా రెడ్డి - మల్కాజిగిరికి చెందినవారు కాదు; వారంతా స్థానికేతరులు. అయితే, వీరిలో లక్ష్మా రెడ్డి మాత్రం నల్గొండ నుంచి వచ్చి ఈ నియోజకవర్గంలోని ఉప్పల్ లో స్థిరపడ్డారు. ఆ రకంగా చూస్తే ఆయన స్థానికుడిగా భావించవచ్చు. 

ముగ్గురూ పార్టీలు మారిన వారే..
Malkajgiri: ఇక్కడ పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ముగ్గురూ పార్టీలు మారి ఇక్కడ సీటు తెచ్చుకున్నవారే కావడం విశేషం. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పోటీ చేశారు. ప్రస్తుతం ఈయన బీజేపీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సునీత మహేంద్ర రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మా రెడ్డి కాంగ్రెస్ నుంచి పార్టీ మారి ఇక్కడ సీటు దక్కించుకున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు పాటీలు మరి పోటీ చేస్తున్నవారు కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 

విలక్షణ ఓటర్లు..
Malkajgiri: ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు విలక్షణ శైలి చూపిస్తూ ఉంటారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం జనరల్ స్థానం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో పోటీచేసిన సర్వే సత్యనారాయణ గెలిచారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక 2014లో మల్లారెడ్డి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిచారు. అలాగే 2019లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అంటే, ఇక్కడ గత మూడు ఎన్నికల్లో ఒకే పార్టీ గెలుపు అందుకోలేదు. అలాగే 2014, 2019 లలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం బలంగా ఉన్నా.. ఇక్కడి ఓటర్లు మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. ఆ రకంగా ఇక్కడి ఓటింగ్ శైలి భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. 

Revanth Road Show at Malkajgiri

ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
Malkajgiri: ముందుగానే చెప్పుకున్నట్టు ఈ నియోజకవర్గం  మినీ ఇండియా. ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఓటర్లుగా ఉన్నారు. కాకపొతే, ఇక్కడ రాజకీయంగా మాత్రం రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువ ఉన్నట్టు చెబుతారు. ఇక్కడ స్తానిక.. స్థానికేతర అంశానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇక్కడ ఉన్న ఓటర్లలో మెజార్టీ శాతం స్థానికేతరులు కావడం అందుకు కారణం. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి .. ఎంపీగా ఉన్నపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం అన్ని నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు ఉండడమే తమ ప్లస్ గా భావిస్తోంది. అయితే, ఆ ఎమ్మెల్యేల్లో కొందరు లక్ష్మా రెడ్డికి సపోర్ట్ చేయడం లేదనే టాక్ ఉంది. ఇక్కడ గెలుపును కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆయన లక్ష్మా రెడ్డిని ఎలాగైనా గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాత్రం మోదీ ఛరిష్మా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకనే, ఇక్కడి ఓటర్లలో ఉత్తర భారత ఓటర్లు ఎక్కువగా ఉండడం ఒక కారణం. కాగా, ఇక్కడ మోదీ రోడ్ షో కు మంచి స్పందన రావడం మరో కారణం. 

KCR road show in Malkajgiri

Malkajgiri: మొత్తంగా చూసుకుంటే, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్ గిరి ఎన్నికల క్షేత్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా.. ఇక్కడి ఓటర్ల విలక్షణ శైలి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తుంది అనే అంశం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి.. జూన్ 4న ఫలితాలు వస్తాయి.. అప్పటి వరకూ మల్కాజ్ గిరి ఓటరు ఎవరికి జైకొడతారనేది సస్పెన్స్ గానే ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి ఓటరు నాడి అంత తొందరగా ఎవరికీ చిక్కదు. 

#elections-2024 #malkajgiri
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe