Election Results: ఓటరన్న షాక్ మామూలుగా లేదు.. దేశమంతా రిజల్ట్స్ తారుమారు!

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసే ఊహాతీతమైన విలక్షణమైన ఫలితాలు ఇచ్చారు ఓటర్లు. దేశవ్యాప్తంగా ఎలాంటి షాకింగ్ ఫలితాలు వచ్చాయో వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

Election Results: ఓటరన్న షాక్ మామూలుగా లేదు.. దేశమంతా రిజల్ట్స్ తారుమారు!
New Update

Election Results: ఓటరును దేవుడు అని ఊరికే అనరు. పాపాలన్నీ లెక్కేసి టైమ్ వచ్చినపుడు దేవుడు ఎలా శిక్షిస్తాడో.. రాజకీయనాయకుల విషయంలో ఓటర్లు కూడా అలానే స్పందిస్తారు. ఐదేళ్లపాటు భరిస్తారు. సహిస్తారు. ఒక్క సెకనులో అందరి తలరాతలు మార్చేస్తారు. అసలు ఎందుకు ఎలా ఎవరికి షాక్ ఇస్తారో.. ఎవరిని ఎలా నెత్తిన పెట్టుకుంటారో ఉహిచడం కష్టం. కానీ, సర్వేలనీ.. ఎగ్జిట్ పోల్స్ అనీ రకరకాల అంచనాల విధానాలతో శాస్త్రీయంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ, ఆ అంచానాలు ఎప్పుడో ఒకసారి తప్ప కరెక్ట్ కాకపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఓటరు తీర్పు అనూహ్యంగా వచ్చింది. ఎవరి అంచనాలకు అందకుండా సైలెంట్ గా షాక్ ఇచ్చారు ఓటర్లు. ఇదేదో ఒక రాష్ట్రానికో.. ఒక ప్రాంతానికో కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ ఓటరు ఈసారి ఎవరి అంచనాలకు దొరకలేదు సరికదా.. ఫలితాలు చూసిన తరువాత అన్ని రాజకీయ పక్షాలు కూడా అవాక్కయ్యేలా చేసింది. ఫలితాల్లో అంచనాలు తారుమారు అయిన విధానం ఏమిటో వివరంగా చూద్దాం. 

ఏపీ ఫలితాలు..
Election Results: మొత్తం దేశాన్ని తనవైపు తిప్పుకున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికలు. అధికారంలో ఉన్న వైసీపీ సంక్షేమ పథకాలతో తమ గెలుపు పక్కా అనే ధీమాలో ఉంది. మరో పక్క వైసీపీని ఓడించాలని.. టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టాయి. హోరాహోరీ ప్రచారం.. అర్ధరాత్రి వరకూ జరిగిన పోలింగ్.. వెల్లువలా వచ్చిపడిన ఓట్లు.. ఎన్నికలయ్యాక హింసాత్మక సంఘటనలు అన్నీ కలిపి ఏపీ ఎన్నికల వైపు జాతీయ స్థాయిలో మీడియా ఎటెన్షన్ అయిన పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలు వెల్లడించాయి. అయితే, అందరూ తక్కువ మెజార్టీతో ఏ పార్టీ అయినా గెలవచ్చు అని అంచనా వేశారు. ఫలితాలు వచ్చాయి.. అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశాయి. జగన్ ఈ రేంజ్ లో ఓడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కూటమి కట్టిన నేతలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించారు కానీ.. మరీ ప్రతిపక్షం లేకుండా అధికారం కైవసం అవుతుందని ఊహించలేదు. 

తెలంగాణలో ఇలా..
Election Results: కొద్ది నెలల ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసింది కాంగ్రెస్ పార్టీ. మూడో స్థానంలో నిలిచింది బీజేపీ. అయితే, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. 17 సీట్లలో కనీసం ఒక్క స్థానమూ గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. కేవలం రెండు స్థానాల్లోనే రెండో ప్లేస్ దక్కింది. మిగిలిన చోట్ల మూడోస్థానంలోనే నిలబడాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమి ఊహించిందే.. కానీ, మరీ ఇంత దారుణంగా మూడోస్థానానికి నెట్టేస్తారు ఓటర్లు అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. 

ఎన్డీయే సీట్లు..
Election Results: నాలుగు వందల సీట్లు లక్ష్యంగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎన్నికల బరిలోకి వచ్చింది. ప్రధాని మోదీ చరిష్మా.. కేంద్రంలో బీజేపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ మీడియా వేసిన అంచనాలు.. భారీ మెజార్టీతో మూడోసారి మోదీ ప్రధాని కాబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ లెక్కలు.. అన్నిటినీ తప్పు అనేలా చేశారు ఓటర్లు. అరకొర మెజార్టీతో.. ఇంకా చెప్పాలంటే ఏ ఒక్క పార్టీ తమకు కటీఫ్ చెప్పినా మైనార్టీలో పడిపోయే ప్రమాదం ఉన్నంత తక్కువ స్థాయిలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అవుతోంది బీజేపీ. 

ఒడిశాలో బీజేపీ..
Election Results: ఒడిశా ఇది ఒక ప్రత్యేక రాష్ట్రం.. వరుసగా ఆరుసార్లు ఒక్కరే ముఖ్యమంత్రి. అధికారంలో ఒకటే పార్టీ. నవీన్ పట్నాయక్ కాకుండా ముఖ్యమంత్రిగా మరొకరిని ఊహించలేని పరిస్థితి. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండిటిలో ఘోర పరాజయం చెందింది. ఎంత దారుణ పరాజయామంటే లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలిసారిగా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 

యూపీలో రాముడు కూడా కాపాడలేదు..
Election Results: అయోధ్యలో బలరాముని ప్రతిష్ట బీజేపీ ప్రతిష్ఠ ను పెంచింది అని అనుకున్నారు. కానీ, స్వయంగా ప్రధాని మోదీ వారణాసిలో మొదటి రౌండ్స్ లో వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపించింది. తరువాతి రౌండ్స్ లో మెజార్టీ వచ్చి గెలిచారు అది వేరేసంగతి. ఇక అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి పాలైంది. అమేథీలో కాంగ్రెస్ గెలిచింది. యూపీలో కచ్చితంగా బీజేపీ హవా అనుకున్నారు. కానీ, బీజేపీకి షాక్ ఇచ్చారు అక్కడి ఓటర్లు. మోదీ-యోగీ ప్రభావం ఏమీ కనిపించలేదు. అక్కడ సగం సీట్లతోనే సరిపెట్టుకుంది ఎన్డీయే. 

మమత గీత టచ్ కూడా చేయలేరు..
Election Results: వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ఈసారి గణనీయంగా సీట్లు గెలుచుకోబోతోందని అందరూ అనుకున్నారు. కానీ, అక్కడ మమత గీసిన గీతను ఎవరూ టచ్ కూడా చేయలేరని మరోసారి నిరూపితం అయింది. బీజేపీ అక్కడ ఎంత ప్రయత్నం చేసిన 39 శాతం మించి ఓట్లు రాని పరిస్థితి. 

ఇదికూడా చదవండి: పూర్తయిన కౌంటింగ్.. ఫైనల్ లెక్కలు ఇవే!

బీహార్‌లో బీజేపీ, జేడీయూ పట్టు నిలబెట్టుకోగలిగారు. ఇక్కడ ఆర్జేడీ పుంజుకునే ఛాన్స్ ఉందని భావించారు కానీ, ఆ ఛాన్స్ లేదని తేలిపోయింది. నితీష్ కుమార్ బీజేపీ తో జట్టు కట్టడం మైనస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ, ఓటరు మాత్రం నితీష్ కుమార్ కె జై కొట్టాడు. 

తమిళనాడులో స్టాలిన్ కింగ్..
Election Results: తమిళనాడులో బీజేపీ విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిగా అయినా ప్రభావం చూపిస్తుందని అనుకున్నా.. స్టాలిన్ ముందు ఆ పప్పులు ఉడకలేదు. ఓటరు అస్సలు బీజేపీవైపు చూడలేదు. 

మధ్యప్రదేశ్, గుజరాత్ లలో  బీజేపీ క్లీన్ స్వీప్ చేయగలిగింది. ఇది ఊహించిన విజయమే. 

కర్నాటకలో సంక్షేమ పథకాలు పనిచేయలేదు..
కElection Results: ర్ణాటకలో  సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉచిత పథకాల ప్రభావం కాంగ్రెస్ కి కలిసొస్తుందని అనుకున్నారు. ఉచితాలు ఓట్లు తెస్తాయని బలంగా నమ్మారు. ఏపీలనే ఇక్కడ కూడా ఓటర్లు కాంగ్రెస్ ను పక్కన పెట్టి.. బీజేపీకి జై కొట్టారు. 

రాజస్థాన్ లో 10 స్థానాలు సాధించి ఇండి కూటమి బలంగా నిలబడింది. ఎన్డీయేను 14 స్థానాలకు పరిమితం చేయగలిగింది. 

కేరళలో లెఫ్ట్ పార్టీ ఒక్కస్థానానికి పరిమితం అయింది. ఈ దెబ్బతో లెఫ్ట్ పార్టీల పరిస్థితి అగమ్యగోచరం అయిపోయినట్టే అనిపిస్తోంది. 

జార్ఖండ్ లో బీజేపీ స్వీప్ చేస్తుందని అనుకున్నారు. అక్కడి ముఖ్యమంత్రి జైలుకు వెళ్లినా.. అది బీజేపీకి కలిసిరాలేదు. 

పంజాబ్ లో అధికార ఆప్ కు చుక్కెదురైంది. కాంగ్రెస్ పుంజుకుంది. నిజానికి ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందని అనుకున్నారు. 

ఇక ఢిల్లీలో ఆప్ కి పూర్తి పరాభవం ఎదురైంది. బీజేపీ ఇక్కడ అన్ని స్థానాలు గెలుచుకుంది. 

Election Results: ఇలా దాదాపు దేశవ్యాప్తంగా ఓటరు ఎక్కడికక్కడ నాయకుల ఆధిపత్య ధోరణికి కత్తెర వేశాడు. సంక్షేమ పథకాలిచ్చి ఓట్లు కొట్టేద్దామనుకునే అధికార పక్షం ఉన్నదగ్గర ఆ పార్టీలను చావుదెబ్బ కొట్టాడు. ఏపీ, కర్ణాటక దానికి పెద్ద ఉదాహరణలు. 

మొత్తంగా చూసుకుంటే, ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పక్షాలకు సమానంగా గట్టి గుణపాఠం నేర్పించాయి. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి.. ప్రజల సమస్యలపై స్పందించని పార్టీలను చాకిరేవు పెట్టేశారు ఓటర్లు. ఇది గుణపాఠంగా తీసుకుని ఇప్పుడు పార్టీలు జాగ్రత్తపడకపోతే.. భవిష్యత్ ఎన్నికల్లోనూ ఇలాంటి చావుదెబ్బలు మరిన్ని చూస్తామనడంలో సందేహం లేదు.

#elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి