/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/v-jpg.webp)
East Godavari District: చెవిలో చెబితే కోరికలు వినే శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆదిదేవుడు గణనాథుడు. అటువంటి గణనాధుని క్షేత్రాలలో కల ప్రసిద్ధిగాంచింది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. వేకువ జాము నుండే స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి.
బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదఅంకితఓలు గా పిలిచేవారు, తూర్పు చాళుక్య రాజులకు ఈ గ్రామం రాజధానిగా ఉండేది 849- 892 సంవత్సరాల మధ్యకాలంలో రాజులు ఈ గ్రామంలో అనేక ఆలయాలు నిర్మించారు. వాటిలో ఒకటిగా తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తులకు కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతుంది. ఆ తర్వాత కాలంలో నవాబుల పాలనలో ఆలయాలను కూల్చివేయడంతో స్వామివారి విగ్రహం కాలగర్భంలో కలసి పోవడం జరిగింది.
40- 50 సంవత్సరాల క్రితం కొంతమంది భక్తులకు కలలో కనిపించిన స్వామి నేను ఇక్కడే ఉన్నాను నన్ను బయటకి తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే మీ కోరికలన్నీ తీరుస్తానని స్వామి వారు చెప్పడంతో, భక్తులు స్వామి వారిని బయటకు తీసి మదటి లో చిన్న పాక వేసి పూజలు ప్రారంభించారు. ఇక్కడ వినాయకుని విగ్రహానికి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఒక విశిష్టత, ఇక్కడ స్వామి వారు కొంచెం కొంచెంగా ఎదుగుతూ విగ్రహం సంవత్సరానికి సంవత్సరానికి పెద్దది కావడం మరొక విశిష్టత, వినాయకుని చెవులు చెప్పిన కోరికలు వెంటనే తీరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం , సోమవారం వేకువ జాముతోనే ప్రత్యేక పూజలు అభిషేకాలతో స్వామివారికి చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన లోటు పాట్లు జరక్కుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు.