వరుస భూకంపాలు జైపూర్ ను కుదిపేసాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు వచ్చారు. జైపూర్‌లో బలమైన భూకంపం వచ్చినట్లు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్వీట్ చేశారు. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
తెల్లవారుజామున 4.09 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. NCS ప్రకారం, భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంప తీవ్రత 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. అక్షాంశం: 26.88 రేఖాంశం: 75.70, లోతు: 10 కిమీ, స్థానం: జైపూర్, రాజస్థాన్ మధ్య భూకంప కేంద్ర ఉన్నట్లు ఎన్ సీఎస్ తెలిపింది.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదిక లేదు. గురువారం తెల్లవారుజామున మిజోరంలోని నాగోపాకు తూర్పున 61 కిలోమీటర్ల దూరంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్ తెలిపింది. NCS ప్రకారం, భూకంపం 80 కి.మీ లోతులో సంభవించింది.
కాగా భూకంప దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జనాలు ఇళ్లలో నుంచి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. నివాసాలు, భవనాలు కదులుతుంటే...భయంతో హడలిపోయారు. ఈ క్రమంలో ఒకరికోకరు ఫోన్లు చేసుకుంటూ వారి బాగోగులు తెలుసుకున్నారు.