తనకల్లు మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ సమీపంలోని చాకివేలు క్రాస్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం బాటిల్స్ తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 92 కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి డీఎస్పీ శ్రీలత (Kadiri DSP Srilatha) తెలిపారు. శుక్రవారం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
వాహనం సీజ్
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తమ సిబ్బంది పెద్దపల్లి సమీపంలో దాడులు నిర్వహించారని చెప్పారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను వెంబడించగా సతీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా.. మరో ముగ్గురు కదిరికి చెందిన కళ్యాణ్ కుమార్, నారాయణస్వామి, మురళి పరార్‌లో ఉన్నట్లు తెలిపారు. అక్రమ మద్యానికి వినియోగించిన వాహనాన్ని సీజ్ చేశామన్నారు. పరార్‌లో ఉన్న వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పంట పొలాలలో విద్యుత్తు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవ్
అంతేకాకుండా.. పంట పొలాలలో విద్యుత్ సరఫరా చేసి వ్యక్తులు, వన్యప్రాణాల మృతికి కారణమైతే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని కదిరి డీఎస్పీ శ్రీలత హెచ్చరించారు. వ్యక్తులు, వన్యప్రాణాలు మృతి చెందితే కారుకులైన వారిపై జైలు శిక్ష తప్పని చెప్పారు. ఇప్పుడు సెలవులు కాబట్టి ఎక్కడైనా పేకాటలు, మద్యం సంబంధించి ఏమైనా జరిగితే.. ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది..చిన్నారి మృతికి బాధ్యత వహించాలి: వంగలపూడి అనిత