ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సమీపంలో సోమవారం డ్రోన్ కలకలం రేపింది. డ్రోన్ ఎగురుతున్నట్లు సమాచారం తెలియడంతో భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు…బంగ్లాదేశ్ కు చెందిన మహిళ రిమోట్ కంట్రోల్ తో డ్రోన్ ఎగురవేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే డ్రోన్, రిమోట్ స్వాధీనం చేసుకుని…మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న స్పెషల్ సెల్, ఐబీ సహా అన్ని గుఢచారా సంస్థలు అక్కడికి చేరుకున్నాయి. మహిళలను మండవలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఆ మహిళ మొదట తాను ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టు అని చెప్పుకున్నట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం…బంగ్లాదేశ్ లోని ఢాకా నివాసి మోమో ముస్తాఫా గా గుర్తించారు. ఆమె వయస్సు 33ఏళ్లు. మోమో ముస్తఫా బిబిఏ పాస్ చదువుతూ బంగ్లాదేశ్ లో ఫొటోగ్రఫీ చేస్తున్నారు. ఆమె మే 2023లో ఆరు నెలల పాటు టూరిస్టు వీసా పై భారత్ కు వచ్చింది. అనుమతి లేకుండా ఆలయ సమీపంలో డ్రోన్ ఎగువేస్తున్నందుకు పట్టుబడిన మోమోపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే అక్షరధామ్ దేవాలయం సమీపంలో మహిళ డ్రోన్ ఎగరవేయడం వెనకున్న ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు, బంగ్లాదేశ్ ఎంబసీకీ కూడా సమాచారం అందించారు. మహిళకు సంబంధించిన మొబైల్ ఫోన్ తోపాటుగా, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం టెర్రరిస్టుల లిస్టులో ఉంటుంది.
ఈ ఆలయంపై దాడి చేస్తామని టెర్రరిస్టులు ఎన్నోసార్లు బెదిరింపులకు దిగారు. అలాంటి పరిస్థితిలో అక్షరధామ్ ఆలయం దగ్గర ఎల్లప్పుడూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తుంటారు. డ్రోన్లు లేదా అలాంటి కార్యకలాపాలపై అక్కడ పూర్తి నిషేధం. ఈ క్రమంలోనే సోమవారం డ్రోన్లు ఎగురుతూ కనిపించడం చూసి ప్రజలు షాక్ కు గురయ్యారు. దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో అక్షరధామ్ ఒకటి. ఇక్కడికి నిత్యం వేలాది మంది ప్రజలు ఆలయ దర్శనానికి వస్తుంటారు.