Double trouble in Congress: ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి..మరో వైపు అభ్యర్థుల జాబితా కోసం టీకాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో సీనియర్ల లొల్లి కాంగ్రెస్ లో అలజడిని పెంచుతోంది. కొందరేమో టికెట్ల కోసం దరఖాస్తే చేసుకోకపోతే.. మరికొందరేమో నాకు..నా కొడుక్కి, నాకు..నా భార్యకు ,నాకు.. నా కూతురుకు టికెట్ అంటూ నేతలు డబుల్ ట్రబుల్ ను క్రియేట్ చేస్తున్నారు. సీనియార్టీని అడ్డుపెట్టుకొని ఫ్యామిలీకి రెండు టికెట్లు కావాలని జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు.
ఫ్యామిలీ ప్యాక్ రేస్ లో..!
ఇక ఈ సారి ఖచ్చితంగా మా ఫ్యామిలీకి రెండు టికెట్లు కావల్సిందేనని డిమాండ్ చేస్తున్న వారిలో సీనియర్లు చాలా మందే ఉన్నారు. ఒకరు భార్య కోసం టికెట్ డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు కూతురు, కొడుకు కోసం టికెట్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆ డిమాండ్లను టీపీసీసీ ముందు పెట్టి.. తరువాత హస్తినలో తమతమ సత్తాను పట్టి జోరుగా లాబీయింగ్ జరుపుతున్నారు. ఇక కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్న వారిలో లిస్ట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జానారెడ్డి, కొండా సురేఖ, బలరాం నాయక్ ,సీతక్క, దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్ లున్నట్టు సమాచారం.
మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో పాటు తన భార్యకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక జానా రెడ్డి తన ఇద్దరు కొడుకులకు టికెట్ కావాలంటూ పట్టుపట్టారు. సీతక్క కూడా తమ కొడుకులకు టికెట్ కావాలంటున్నారు. బలరాం నాయక్ కూడా తన కొడుకులకు టికెట్ కావాలని కోరుతున్నారు. ఇక ఇలా ఉంటే.. టికెట్ రేస్ లో కొండా మురళి దంపతులిద్దరు ఉన్నారు. దామోదర్ రాజనర్సింహ కూడా తన కూతురుకు టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఈ సారి తనతో పాటు ఇద్దరు కొడుకులకు టికెట్ కావాలని పట్టుబట్టారు.
చేరుతున్న వారు కూడా రెండేసి టికెట్లు కావాలని..!
పార్టీలో ఉన్న సీనియర్ల పరిస్థితి ఇలా ఉంటే..బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్న నేతలు సైతం తమకు రెండేసి టికెట్లు కావాలని డిమాండ్ చేయడం పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్యే రేఖానాయక్, మైనంపల్లి హనుమంత రావు రెండు టికెట్ల ప్రస్తావనను టీపీసీసీ ముందు పెట్టారు. రేఖానాయక్ తనతోపాటు తన భర్తకు కూడా టికెట్ కావాలంటుంటే.. మైనంపల్లి తనకు మల్కాజ్ గిరి టికెట్ అదే విధంగా తన తనయుడికి మెదక్ టికెట్ కావాలని ప్రతిపాదనను పెట్టారు. దీంతో ఈ డబుల్ ట్రబుల్ నుంచి ఎలా ఎస్కేప్ కావాలని కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఫ్యామిలీ ప్యాక్ వద్దే వద్దు..!
అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్ వద్దే వద్దంటూ మిగతా నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నేతకు రెండేసి టికెట్లు ఇవ్వొద్దని అసంతృప్తిని వ్యక్త పర్చుతున్నారు. ఒక ఫ్యామిలీకి ఒకే టికెట్ ఇవ్వాలని చెబుతున్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా అయితే ఒక ఫ్యామిలీకి ఒకే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. మరి సీనియర్ల నుంచి ఎదురవుతున్న ఈ డబుల్ ట్రబుల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా తప్పించుకుంటుందోనన్నది ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్,కాంగ్రెస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం: కిషన్ రెడ్డి