గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలను తిరస్కరించే అధికారం ఉందా?

గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను శాసనమండలికి పంపేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది చాలా ముఖ్యమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించే అవకాశమే లేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ఎమ్మెల్సీలను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

New Update
గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలను తిరస్కరించే అధికారం ఉందా?

గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను శాసనమండలికి పంపేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. బలహీన వర్గాలకు చెందిన శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యానారాయణలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనను వెంటనే గవర్నర్‌కు పంపించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ ఆమోదం తెలిపిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించే అవకాశమే లేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా.. చాలా కాలం ఆ ఫైల్ పెండింగ్‌లో ఉంది.

కౌశిక్‌రెడ్డి విషయంలో వివాదం..

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2021 ఆగస్టులో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆమోదం కోసం గవర్నర్ కార్యాలయానికి పంపించారు. అయితే గవర్నర్ తమిళిసై కొంతకాలం పాటు ఆ ఫైల్‌ ఆమోదించలేదు. దీంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. గవర్నర్ తీరును ప్రభుత్వం పెద్దలు తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని పరిణామాల తర్వాత ఎట్టకేలకు గవర్నర్ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా గుర్తిస్తూ ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు వెనకబడిన వర్గాల నుంచి దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎంపిక చేయడంతో గవర్నర్ వద్దకు ఆమోదం కోసం ఆ ఫైల్ వెళ్లనుంది. గత పరిణామాల నేపథ్యంలోనే ఎమ్మెల్సీలను గవర్నర్ తిసర్కరించే అవకాశమే లేదని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా?

గతంలో తమిళనాడులో ఒక మంత్రిని సస్పెండ్ చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వివాదానికి దారితీసింది . అనంతరం గవర్నర్ తన నిర్ణయం మార్చుకుని తొలగింపు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ఎవరి సలహా లేకుండానే ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. కానీ ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను కూడా నియమించడం జరుగుతుంది. గవర్నర్ విచక్షణాధికారం ఉపయోగించి వ్యక్తిగతంగా మంత్రులను నియమించలేరని ఈ ఆర్టికల్ సూచిస్తుంది. అందుచేత ముఖ్యమంత్రి సలహాతో మాత్రమే మంత్రిని తొలగించాలని రాజ్యాంగం చెబుతుంది. దీనిని బట్టి చూస్తే ముఖ్యమంత్రి నియమించిన శాసనమండలి సభ్యుడిని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టమవుతుంది.

ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తోంది?

ఎందుకంటే తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ నియమితులైన దగ్గరి నుంచి ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య చాతాండంత దూరం పెరిగిపోయింది. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంతో ఈ వివాదం ముదురుతూ వస్తోంది. అప్పటి నుంచి బీఆర్‌ఎస్ నేతలు, తమిళిసై మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ తర్వాత గవర్నర్ 7 బిల్లులను ఆమోదించి 3 బిల్లును వెనక్కి పంపించారు. బిల్లుల విషయమే కాకుండా ప్రభుత్వ పాలనపైనా తమిళిసై విమర్శలు చేయడం.. వాటికి గులాబీ నేతలు కౌంటర్ ఇవ్వడం పరిపాటిగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు