Pawan Kalyan: విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో ఓ ముఠా వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడింది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ ఉద్యోగులు.. అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు దుండగులు వారిపై దాడి చేశారు. దీంతో, ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వన్య ప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విజయపురి సౌత్ అధికారులపై దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఉప పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.