AP: 9 నెలల క్రితం అదృశ్యమైన భీమవరం యువతి ఇవాళ విజయవాడకు చేరుకోనుంది. తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని 10రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి యువతి తల్లి కన్నీటిపర్యంతం అయింది. అప్పటికప్పుడే సీఐతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేసును దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పవన్ ఆదేశాలతో రంగంలోకి స్పెషల్ టీమ్..ఇన్‌స్టా చాట్ ద్వారా యువతిని జమ్ములో గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
విజయవాడలోని తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ యువతి తేజస్విని మాచవరంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అంజాద్ అలియాస్ షన్ను తేజస్వినిని ప్రేమపేరుతో ట్రాప్ చేశాడు. అతను ఇదే విధంగా రెండేళ్ల కిందట కూడా ఓ యువతిని ట్రాప్ చేసి తీసుకుని వెళ్లిపోయాడు. ఇలా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంజాద్ యువతులకు మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో వలవేసేవాడని తెలిసింది. కొంతకాలం తేజస్వినితో సన్నిహితంగా మెలిగిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 28న రాత్రి ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లారు. తేజస్విని కనిపించకపోయేసరికి.. కంగారు పడిన తల్లి విజయవాడ వచ్చి మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఫోన్లు అమ్మేసి..
కేసు దర్యాప్తులో యువతీ, యువకుల ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా వారిద్దరూ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు హోటల్‌కు చేరుకునేసరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వీరి ఆచూకీ అక్కడి సీసీ కెమెరాల్లోనూ లభించలేదు. అయితే, కర్చులకు డబ్బు లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ షాపులో రూ.18 వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. IMEI నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టినా ఎటువంటి సమాచారం లభించలేదు.
హైదరాబాద్ - జమ్ము..
తొలుత హైదరాబాద్ వెళ్లిన ఈ జంట అక్కడ కొన్ని రోజులు ఉండి ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో కేరళకు వెళ్లి అక్కడ 10 రోజులు ఉన్నారు. అక్కడా ఇల్లు దొరక్కపోవడంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చారు. కర్చులకు డబ్బు లేకపోవడంతో తేజస్విని తన చెవి కమ్మలను రూ.15 వేలకు అమ్మేసింది. తరువాత అక్కడి నుంచి రాజస్థాన్, ముంబై, పుణే, ఢిల్లీ వెళ్లారు. అయితే, మళ్లీ అక్కడి నుంచి జమ్ముకు వెళ్లారు. ఇక కర్చులకు డబ్బు లేకపోయేసరికి అంజాద్ ఓ హోటల్‌లో పనిలో చేరాడు. ఫోన్లు అమ్మడం..కొత్త నంబర్లు తెలియకపోవడంతో కేసు కష్టంగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌తో..
అంజాద్ ఇంట్లో లేని సమయంలో ఇటీవల అతని ఫోన్ నుంచి అక్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి మెసేజ్ చేసింది. ఇన్‌స్టా చాట్ ద్వారా వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నించారు. వారు ఎక్కడున్నది ఆమె చెప్పలేకపోవడంతో యువతి లొకేషన్ పంపింది. అదీ ఫెయిలవడంతో ఓ ఫొటో ప్రేమ్ పార్శిల్ బాక్స్‌పై అడ్రస్ ఉండగా దానిని ఫొటో తీసి అక్కకి పంపించింది. ఇలా వారు జమ్ములో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తేజస్వి ఆచూకి లభించడంతో తల్లిదండ్రులు, పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.