/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dehli-jpg.webp)
ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కు బిల్లు మంగళవారం ( ఆగస్టు 1) లోకసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు మోదీ కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు అటు విపక్షాలు కూడా అస్త్రాలతో సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023'ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 1న లోక్‌సభలో చేపట్టనున్న వ్యవహారాల జాబితాలో ఈ బిల్లును చేర్చారు. అయితే ముందుగా ఈ బిల్లును సోమవారం జూలై 31న సమర్పించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం దానిని సమర్పించలేదు.
మరోవైపు.. లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నివాసానికి వెళ్లారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య దాదాపు 45 నిమిషాల పాటు భేటీ జరిగింది. అయితే సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు ఈ ఇద్దరి భేటీ చాలా కీలకమని చెబుతున్నారు.
ప్రభుత్వం ఈ బిల్లును లోక్‌సభలో సులువుగా పాస్ చేస్తుందని, అయితే రాజ్యసభలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చని భావిస్తున్నారు. లోక్‌సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదు. రాజ్యసభలోనే ప్రభుత్వాన్ని ఓడించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయని, ఈ బిల్లు ఆమోదం పొందదని ఆయన ఆశిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే పార్టీల షరతుపై ఆప్ ప్రతిపక్ష ఐక్యతకు మద్దతు ఇచ్చింది.
బిల్లులో పలు సవరణలు ;
ఈ బిల్లు చట్ట రూపం దాల్చినట్లయితే ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులకు బదిలీ అధికారలన్నీ కూడా కేంద్రంచేతుల్లోకి వెళ్తాయి. అయితే తాజాగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లులో పలు మార్పులు చేసారు. అందులోని సెక్షన్ 3ఏ, సెక్షన్ 45డిలో కేంద్ర సర్కార్ సవరణలు చేసింది. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ లో సెక్షన్ 3ఏ ను బిల్లు నుంచి పూర్తిగా తొలగించారు. సెక్షన్ 3ఏ అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లోని జాబితా 2లో ఉన్న ఎంట్రీ 41కి సంబంధించింది.
కాగా ఢిల్లీ పబ్లిస్ సర్వీసులకు సంబంధించిన చట్టాలను రూపొందించే హక్కు ఢిల్లీ అసెంబ్లీకి లేదని ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. కానీ ప్రతిపాదిత బిల్లులో ఆర్డినెన్స్ లో సెక్షన్ 45డి కింది ఉన్న నిబంధనలను మరింత సులభం చేశారు. సెక్షన్ 45డీ అనేది పలు ప్రభుత్వ మండళ్లు, కమీషన్లు, అధికారులు, చట్టబద్ధమైన సంస్థల నియామాకాలతో ముడిపడి ఉంటుంది.