/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/dalitmann.jpg)
మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడి ముఖంపై ప్రవేశ్‌శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కరెంటు పనులు చేసే ఓ దళితుడిపై దాడి చేయడమే కాకుండా.. తన చెప్పులను బలవంతంగా నాకించాడు ఓ దుర్మార్గుడు. నిందితుడిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్న తేజ్‌బలిసింగ్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
పటేల్ ఎందుకిలా చేశాడు..?
ఉత్తరప్రదేశ్‌లోని సోన్ భద్ర జిల్లా షాగంజ్‌కు చెందిన రాజేంద్ర ప్రైవేట్‌గా కరెంటు పనులు చేస్తుంటాడు. అతనో దళితుడు. సాధారణంగా గ్రామాల్లో కరెంట్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ డివైజ్‌లు తరుచుగా రిపైర్‌కు వస్తుంటాయి. షాగంజ్‌లోనూ అదే పరిస్థితి ఉంటుంది. తమ ఇంట్లో ఏదైనా కరెంట్ సమస్య ఉంటే గ్రామస్తులు ఒకప్పుడు తేజ్‌బలిసింగ్ పటేల్‌కి కబురు పంపేవారు. ఆయనకు వీలునప్పుడు వచ్చి సమస్యను సాల్వ్ చేసి డబ్బులు తీసుకొని వెళ్లేవాడు. అయితే ఈ మధ్య కాలంలో పటేల్‌ని పెద్దగా ఎవరూ పిలవడంలేదు. ఎందుకంటే రాజేంద్ర పటేల్ కంటే తక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు. అందుకే ఏ కరెంట్ పని కావాల్సి ఉన్నా రాజేంద్రనే ప్రజలు పిలుస్తున్నారు. ఇదంతా గమనిస్తూ వచ్చిన పటేల్ పలుమార్లు రాజేంద్రని బెదిరించాడు.. ఇళ్లలో కరెంట్ పనులు తాను మాత్రమే చేయాలని హెచ్చరించాడు. పటేల్ మాటలను పట్టించుకోని రాజేంద్ర తన కుటుంబపోషన కోసం తన వృత్తిని వదులుకోలేకపోయాడు. అదే పటేల్ ఆగ్రహానికి కారణమయ్యింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/dalitmann.jpg)
ఊహంచని విధంగా దాడి:
రోజూలానే కరెంట్ పనికి వెళ్లాడు రాజేంద్ర. ఈసారి తమ బంధువుల ఇళ్లలోనే కరెంట్ పని ఉండడంతో అక్కడికి చేరుకున్నాడు. ఈ విషయం పటేల్ దృష్టికి వెళ్లింది. రాజేంద్రపై దాడికి ఇదే సరైన టైమ్ అని భావించిన పటేల్.. తన మనుషులను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజేంద్రని బంధువుల ఇంట్లో నుంచి బయటకు లాగి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కాలుతో తన్నాడు.. గుంజీలు తీయించాడు. క్షమాపణ చెప్పమంటూ చెంపలపై కొట్టాడు. అంతటితో ఆగలేదు. తన ఉమ్మిని చెప్పులపై వేసుకోని బలవంతగా నాకించాడు. తాను చేస్తుందేదో ఘనకార్యమన్నట్టు ఇదంతా వీడియో రికార్డు చేయించుకున్నాడు. ఆ వీడియోని సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయమని తన మనుషులకు చెప్పాడు.
సోషల్‌మీడియాలో వైరల్:
పటేల్ చెప్పిన విధంగానే ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేశారు అతని మనిషులు. ఈ వీడియోలు కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కూడా దర్శనమిచ్చాయి. ఓవైపు వీడియో వైరల్‌గా మారిన సమయంలో రాజేంద్ర ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. సోషల్‌మీడియాలో ఉన్న వీడియోలతో పాటు రాజేంద్ర కంప్లైంట్‌తో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పటేల్‌ని అరెస్ట్ చేశారు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పటేల్‌ని విధుల్లో నుంచి తప్పించింది.