Heavy Rainfall in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఇక అన్నవరంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. పంపానది, అన్నవరం రైల్వేస్టేషన్‌లో సుడిగాలులు వచ్చాడు. ఈ పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాంతో పలు గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది.
విశాఖ, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని గ్రహించిన అధికారులు దుర్గా ఘాట్ రోడ్డు మూసివేశారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. భారీ వర్షాలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 125 రైళ్లను క్యాన్సిల్ చేశారు ధికారులు. తుఫాన్ తీరం దాటినా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో జోరు వానలు పడుతున్నాయి. కాగా, మిచౌంగ్ తుపాను ఉత్తరం వైపు కదులుతూ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మంగళవారమే తీరం దాటిన తుపాను..
మిచౌంగ్ తుపాను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల సమీపంలో తీరం దాటింది. తుపాను తీరం దాటిన సమయంలో తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. మిచౌంగ్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. మరో రెండు గంటల్లో మిచౌంగ్ తుపాను బలహీనపడనుందని అధికారులు తెలిపారు.
సీఎం జగన్ సమీక్ష..
మరోవైపు తుపాను ప్రభావంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను బాధితులు ఇబ్బంది పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సహాయక శిబిరాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. శిబిరాల నుంచి వెళ్లే బాధితులకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. 48 గంటల్లో పంట, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
Also read: