Telangana Crop: తెలంగాణలో వానాకాలం పంటల సాగును ఈ సారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు రైతులు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది వానాకాలంలో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు అధికారులు.
ఈ ఏడాది వానాకాలం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.76 శాతం విస్తీర్ణంలో పంటలు వేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు వేసిన పంటల్లో అత్యధికంగా పత్తి ఏకంగా 33.81 లక్షల ఎకరాల్లో సాగైనట్టు పేర్కొన్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 68.97 శాతం వేసినట్లు చెప్పారు.
మరోవైపు వరి సాధారణ సాగు విస్తీర్తం 57.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో నాట్లు వేసినట్టు తెలిపారు. అంటే ఈ సారి మూడు శాతానికే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో వేసినట్లు వెల్లడించారు.