Crimes: దుర్మార్గుల ఆయుధంగా మూత్రం....మంటగలుస్తున్న మానవత్వం..!

ఇటివలి కాలంలో మూత్రం చుట్టూ నేరాలు పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌, ఒంగోలు ఘటనల తరహాలోనే గతంలోనూ సాటి మనుషులపై మూత్రం పోసిన ఘటనలు వెలుగుచూశాయి.

New Update
Crimes: దుర్మార్గుల ఆయుధంగా మూత్రం....మంటగలుస్తున్న మానవత్వం..!

చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా ఉన్మాదం వంద రెట్లు అధికంగా ఉంది. ఇటివలి వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే సమాజం ఎటు పోతుందో అర్థంకాని దుస్థితి దాపరించింది. సాటి మనుషులపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం చూస్తుంటే అసహ్యమేస్తుంది. వర్తమాన చరిత్ర భవిష్యత్తు ముందు తలవంచుకోని ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మనిషి ఇంత నీచంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గునిగా, ఒక రాక్షసుడుగా ఎలా మారిపోయాడు..? మూత్రం చుట్టూ జరుగుతున్న నేరాలు దేనికి సంకేతం..? మధ్యప్రదేశ్‌, ఒంగోలు ఘటనలు ఏం చెబుతున్నాయి..? ఈ రెండు ఘటనలే కాదు..బయటకు రాని ఘటనలు అనేకం ఉన్నాయి. భార్యని మూత్రం తాగమని బలవంతం చేసే శాడిస్టు భర్త నుంచి తక్కువ కులం అబ్బాయి తమ అమ్మాయిని ప్రేమించాడని మూత్రం తాగించే కులోన్మాదుల వరకు ఈ తరహా ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడో జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఉదంతాలను గమనిస్తే ఇంత నీచులా వీళ్లంతా అని అనిపించక మానదు..!

జర్నలిస్టుపై రైల్వే పోలీసుల దాడి(జున్, 2019):
‘న్యూస్ 24’ అనే చానల్ తరఫున శామ్లీ జిల్లాలో స్ట్రింగర్‌​గా పని చేస్తున్న అమిత్ శర్మ అనే జర్నలిస్టుపై రైల్వే పోలీసులు దాడి చేసిన ఘటన 2019జూన్‌లో ప్రకంపనలు సృష్టించింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పిందన్న సమాచారంతో..ఆ వార్తని కవర్ చేసేందుకు అమిత్ శర్మ వెళ్లాడు. ఘటనకు సంబంధించిన వాటిని రికార్డ్‌ చేయడం మొదలుపెట్టగా.. అక్కడే ఉన్న కొందరు పోలీసులు సివిల్ డ్రస్సులో వచ్చి అమిత్‌ శర్మని చితకబాదారు. అంతటితో ఆగలేదు..నోట్లో మూత్రం పోసి చిత్రహింసలకు గురి చేశారు.

publive-image చెట్టుకు కట్టేసి దాడి

ప్రేమించాడని..చెట్టుకు కట్టేసి(డిసెంబర్‌, 2019):
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌‌కు కిలో మీటర్ దూరంలో ఉన్న ఖోద్రాలోని కైపదర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర రచ్చకు దారి తీసింది. బంగిడా గ్రామానికి చెందిన ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. విచక్షణ మరిచి చావబాదారు. దాడి చేసిన ముగ్గురు యువకుల్లో ఒకరు ముఖంపై మూత్రం చేశాడు. దీనికంతటికి కారణం ప్రేమ వ్యవహారమేనని తర్వాత తేలింది.

రాజకీయ ప్రకంపనలు రేపిన మధ్యప్రదేశ్‌ ఘటన(2020):
రెండు వారాల క్రితం సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టిన మధ్యప్రదేశ్‌ మూత్రం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన 2020లోనే జరిగినా వీడియో మాత్రం ఈ నెల మొదటివారంలోనే బయటకు వచ్చింది. గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌పై ప్రవేష్ శుక్లా అనే వ్యక్తి మద్యం మత్తులో ముఖంపై మూత్రం పోశాడు. సిధీ జిల్లా కుబ్రి గ్రామంలో జరిగిందీ ఘటన. ప్రవేశ్‌ సిగరెట్ తాగుతూ..మద్యం మత్తులో ఈ పని చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సీఎం ఆదేశాల మెరకు శుక్లాను అరెస్టు చేశారు పోలీసులు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా అదుపులోకి తీసుకున్నారు. శుక్లా బీజేపీ నేత అని ప్రచారం జరగగా.. అతనికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తోసిపుచ్చింది. తమ పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకు కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సీఎం చౌహన్ బాధితుడిని తన ఇంటికి పిలిపించి ఆయన కాళ్లు కడిగారు.

దళితుడి చెవిలో మూత్రం(జులై, 2023):
యూపీలోని సోన్‌భద్రలో ఓ వ్యక్తి దళితుడి చెవిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. జుగైల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న జవహార్‌ పటేల్‌.. గులాబ్‌ కోల్‌ మధ్య జరిగిన గొడవ ఇలా మూత్రం పోసేవరుకు వెళ్లింది. గులాబ్‌ కోల్‌, జవహార్ పటేల్‌, మరో స్నేహితుడు కలిసి పార్టీ చేసుకున్నారు. ఫుల్‌గా తాగేసిన తర్వాత గులాబ్‌ కోల్‌తో జవహార్‌ పటేల్‌కి గొడవ జరిగింది. తాగిన మత్తులో గులాబ్‌ కోల్‌పై దాడి చేయడమే కాకుండా అతడి చెవులపై మూత్రం పోశాడు జవహార్‌ పటేల్.

భార్యపై శాడిస్ట్ భర్త వికృత చేష్టలు(జులై, 2023):
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో ఓ మహిళ తన భర్త తనను బలవంతంగా మూత్రం తాగించి, శారీరకంగా దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. నిత్యం తన భర్త వేధిస్తున్నాడని.. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఒంగోలు ఘటన(జులై:
ఇక తాజాగా ఒంగోలు ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మోటా నవీన్ అనే గిరిజన యువకుడుపై అతని స్నేహితులే దాడికి పాల్పడ్డారు. 9మంది కలిసి నవీన్‌ని కాళ్లుతో తన్నారు. వీరంతా దొంగలు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీళ్ల గ్రూప్‌ మధ్య తలెత్తిన ఇంటర్‌నెల్‌ వార్‌ ఈ గొడవకు దారి తీసింది. నవీన్‌ని చావబాదడమే కాకుండా అతని ముఖంపై మూత్రం పోశారు. మరికొందరు నోట్లోనే యూరిన్‌ చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇంకొందరు తమ మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేశారు. ఈ అమానవీయ ఘటనతో మానవత్వంపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా మూత్రం చుట్టూ నేరాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Advertisment