Kurnool Bus Accident: సీట్ల‌లో అస్థిపంజ‌రాలు, మాంస‌పు ముద్ద‌లు.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు వింటే..!

కర్నూలు వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 30 మందికి పైగా మరణించారు. ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి ఘటనా దృశ్యాలను మీడియాకి వివరించారు. బస్సు బైక్‌ను ఢీకొట్టి మంటల్లో కాలి బూడిదైంది. డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Kurnool Bus Accident

Kurnool Bus Accident

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వి.కావేరి ట్రావెల్స్(V Kaveri Travels) బస్సు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ భయానక దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన హైమారెడ్డి చెబుతున్న విషయాలు అందరికి కంటతడి పెట్టిస్తున్నాయి..

శరీరాలు అస్థిపంజరాల్లా..

హైమారెడ్డి మాట్లాడుతూ “నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు వద్ద భారీ ట్రాఫిక్ కనిపించింది. కారణం అడిగితే డ్రైవర్ ‘బస్సు కాలిపోతోందంట’ అని చెప్పాడు. వెంటనే కారు దిగి అక్కడికి వెళ్లాను. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. కొందరు గాయాలతో ఉన్నారు, కొందరు ఏడుస్తున్నారు. నేనే వెంటనే కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాను. ఆయన తక్షణం స్పందించి సిబ్బందిని పంపించారు. కానీ అప్పటికి బస్సు మొత్తమూ మంటల్లో కాలి బూడిద అయిపోయింది. లోపల ఉన్నవారి శరీరాలు అస్థిపంజరాల్లా మారిపోయాయి. ఆ దృశ్యం చూసి నా మనసు విరిగిపోయింది” అని భావోద్వేగంగా చెప్పారు.

హైమారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ధర్మవరం ప్రాంతానికి చెందిన హరీష్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పినా అప్పటికే ప్రమాదం తీవ్ర స్థాయికి చేరింది. బస్సు కింద ఒక బైక్ చిక్కుకోవడంతో అది కూడా మంటల్లో కాలిపోయింది. బైక్ రైడర్ అక్కడికక్కడే మరణించాడు.

ప్రమాదంలో రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం వంటి కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందిన వారే.

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ “బస్సు గురువారం రాత్రి 10.30కి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 సమయంలో బైక్‌ను ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో బయటపడలేకపోయారు. ప్రమాదంలో 42 మంది ఉన్నారు. వారిలో 30 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. ప్రమాదం తర్వాత డ్రైవర్, సహాయకుడు పారిపోయారు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు” అని వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. 

Advertisment
తాజా కథనాలు