/rtv/media/media_files/2025/11/20/us-2025-11-20-08-44-55.jpg)
2017లో అమెరికాలోని న్యూజెర్సీలో దారుణంగా హత్యకు గురైన ఏపీకి చెందిన శశికళ నర్రా (38),ఆమె ఆరేళ్ల కుమారుడు అనీష్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత హత్య వెనుక అసలు నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఆ కీలక ఆధారం మరెక్కడో కాదు... నిందితుడి కంపెనీ ల్యాప్‌టాప్‌లో లభించింది.
పలుమార్లు కత్తితో పొడిచి
శశికళ, ఆమె భర్త హనుమంతరావు ఇద్దరూ ఐటీ నిపుణులుగా కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థలో పనిచేసేవారు. వీరు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లో నివసించేవారు. వీరికి అనీష్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 2017 మార్చి 23న హనుమంతరావు ఇంటికి తిరిగి రాగానే, తన భార్య, కుమారుడు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారిద్దరిపై పలుమార్లు కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు మొదట్లో భర్త హనుమంతరావుపై అనుమానాలతో దర్యాప్తు జరిగింది.
దర్యాప్తులో భాగంగా హత్య జరిగిన ప్రదేశంలో బాధితులకు లేదా హనుమంతరావుకు చెందని అపరిచితమైన రక్తం చుక్కలు పోలీసులకు లభించాయి. వాటి డీఎన్ఏ నమూనాను భద్రపరిచారు. హనుమంతరావు సహోద్యోగి అయిన నజీర్ హమీద్ ఈ హత్యకు కొద్ది దూరంలోనే నివసించేవాడు. విచారణలో భాగంగా, గతంలో హనుమంతరావును హమీద్ వేధించినట్లు, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత హమీద్ అమెరికా వీసాపై ఉండగా, హఠాత్తుగా ఉద్యోగం చేస్తూనే భారత్‌కు తిరిగి వచ్చాడు.
అమెరికా అధికారులు పలుమార్లు హమీద్‌ను సంప్రదించి, అతడి డీఎన్ఏ నమూనా ఇవ్వాలని కోరినప్పటికీ, అతను నిరాకరిస్తూ వచ్చాడు. హమీద్‌ను భారత్ నుంచి విచారించడం కష్టమని భావించిన అమెరికా కోర్టు, 2024లో అతని కంపెనీ (కాగ్నిజెంట్)కి ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఉద్యోగం కోసం హమీద్‌కు జారీ చేసిన కంపెనీ ల్యాప్‌టాప్‌ను తమకు పంపాలని కోరింది. ఆ ల్యాప్‌టాప్‌పై ఉన్న డీఎన్ఏ నమూనాను సేకరించి, దాన్ని ఘటనా స్థలంలో లభించిన రక్తపు చుక్కల డీఎన్ఏతో పోల్చగా సరిగ్గా మ్యాచ్ అయింది.
ల్యాప్‌టాప్ ఆధారంగా డీఎన్ఏ మ్యాచ్ అయిన తరువాత, అమెరికా అధికారులు నజీర్ హమీద్‌ను హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హమీద్ భారత్ లో ఉన్నందున, అతడిని తిరిగి అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు భారత విదేశాంగ శాఖను కోరారు. వ్యక్తిగత కక్షల కారణంగానే హమీద్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Follow Us