/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-2025-11-03-10-42-49.jpg)
Chevella Bus Accident
Chevella Bus Accident: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సమీపంలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కి గురిచేసింది. మీర్జాపూర్ గ్రామం దగ్గర ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 24మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది.
ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ “చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. 24మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.
అలాగే నారా లోకేష్ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ “రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం హృదయాన్ని కదిలించింది. ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా అశ్రు నివాళులు. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమా, లేక వాహనాల లోపమా అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
ఈ ప్రమాదం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని సృష్టించింది. బస్సులో సాధారణంగా ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబాలను కన్నీరులో ముంచింది. సోషల్ మీడియాలో ప్రజలు కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలచివేసింది. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గాయపడిన వారిని కాపాడాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా రోడ్డు భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Follow Us