Eluru District :
ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తంతో తడిసిపోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని తనలో కలిపేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు పారిపోగా..మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జీడిపిక్కల లోడుతో…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా టి .నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయల్దేరింది. ఆరిపాటి దిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపు తప్పి పంటబోదెలోకి వాహనం దూసుకెళ్లింది.
పరారీలో డ్రైవర్..
దీంతో వాహనం ఒక్కసారిగా తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది జట్టు సభ్యులు ఉండగా వారిలో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం ఒక్కసారిగా తిరగపడడంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో తాడిమళ్లకు చెందిన ఘంటా మధుగా పోలీసులు గుర్తించారు.
చనిపోయినవారు ఎవరంటే…
మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ దేవకుమార్ చనిపోయిన వారి వివరాలను వెల్లడించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి. చినముసలయ్య (35), కత్తవ ఋష్ణ (40) కత్తవ సత్తిపండు (40),తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ ఈ ఘటనలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.