Who is Sana Javed: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) పెళ్లి వ్యవహారం నెట్టింట రచ్చ లేపుతోంది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ గురించి చర్చ జరుగుతోంది. భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా-షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ఈ జంట విడిపోతుందన్న రూమర్స్ సమయంలో షోయబ్ మాలిక్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. షోయబ్‌కు ఇది మూడో పెళ్లి. ఇక అతను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇది రెండో పెళ్లి.
ఎవరి సనా?
క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్(Sana Javed)తో మూడో పెళ్లి చేసుకున్నాడు. షోయబ్-సానియా మీర్జా విడిపోయిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ జంట, జనవరి 20న తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. సనా జావేద్ ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. ఆమె 2012లో 'షెహర్-ఎ-జాత్'తో అరంగేట్రం చేసింది. తరువాత అనేక సీరియల్స్‌లో కనిపించింది. రొమాంటిక్ డ్రామా 'ఖానీ'లో టైటిల్ రోల్‌తో ఆమెకు గుర్తింపు దక్కింది. అక్టోబర్ 2020లో, ఆమె కరాచీలోని తన నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం అప్పట్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పాక్‌లో అత్యంత ఆరాధించే ప్రముఖ జంటలలో వీరు ఒకరిగా మారారు.
హ్యాపీ బర్త్‌డే బడ్డీ:
అయితే వారి వైవాహిక ఆనందం స్వల్పకాలికం మాత్రమేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. . కొంతకాలం తర్వాత, వారు విడివిడిగా ఉండటం ప్రారంభించారు. వారి వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఒకరికొకరు ఫొటోలను డిలీట్ చేసుకున్నారు. ఈ జంట విడాకుల గురించి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు.. అయితే ఈ కపుల్ విడాకులు తీసుకున్నారని ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత కొంతకాలానికి షోయబ్ మాలిక్- సనా జావేద్ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. గతేడాది సనా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన మాలిక్ అగ్నికి ఆజ్యం పోశాడు. 'హ్యాపీ బర్త్‌డే బడ్డీ' అని షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ కథ అనేక మలుపులు తిరిగి చివరకు పెళ్లికి దారి తీసింది. గతంలో షోయబ్ మాలిక్ -సానియా మీర్జా 2010లో భారత్‌లోని హైదరాబాద్‌లో సాంప్రదాయ ముస్లిం వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పాక్‌లోని సియాల్‌కోట్‌లో వలీమా వేడుక జరిగింది. ఈ జంటకు మొదటి సంతానం ఇజాన్ 2018లో పుట్టాడు.
Also Read: హైదరాబాద్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ చూసే ఛాన్స్!